Teachers Couple Terrace Garden In Palnadu District: మిద్దె సాగుపై ప్రజల్లో క్రమంగా మక్కువ పెరుగుతోంది. పైకప్పునే వ్యవసాయ క్షేత్రంగా మార్చి పండ్లు, పూలు సాగు చేస్తున్నారు. రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా పూర్తిగా సేంద్రియ విధానంలోనే ఇంటికి కావాల్సిన కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నారు. మిద్దె సాగులో రాణిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్న ఉపాధ్యాయ దంపతులపై కథనం.
వ్యవసాయ రంగంలో రసాయనాల వాడకం పెరిగిన నేటి తరుణంలో మిద్దె తోటల సాగుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన ఉపాధ్యాయ దంపతులు ఇందిరాదేవి, శివశంకర్ మూడేళ్ల నుంచి మిద్దె సాగు చేస్తున్నారు. వివిధ రకాల పూలు, కూరగాయలు, పండ్ల మెుక్కలతో పెద్దఎత్తున మిద్దె తోటలో పండిస్తున్నారు. తులసి, అల్లోవెరా, సబ్జా, వాము, కలబంద వంటి ఔషధ మొక్కలు పెంచుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. ఈ మొక్కలతోనే నయం చేసుకుంటామని దంపతులు అంటున్నారు.
ఎలాంటి రసాయనాలు వాడకుండా కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ మొక్కలను సంరక్షించుకుంటున్నారు. తెగుళ్ల నివారణనకు వేపనూనె, వెల్లుల్లి రసం, పచ్చిమిర్చి రసం, కుంకుడుకాయ రసం వంటివి తయారుచేసి పిచికారీ చేస్తున్నారు. కోతుల నుంచి మొక్కలను, కూరగాయలను, పండ్లను సంరక్షించుకోవటానికి ఇంటి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. మొక్కలను నర్సరీల ద్వారా కొనకుండా విత్తనాల ద్వారా పెంచుతున్నారు. మిద్దెతోటల సాగుతో పండ్లు, కూరగాయలు ఇలా స్వయంగా పండించుకుని తినటం తమకెంతో సంతోషంగా ఉందని ఇందిరాదేవి దంపతులు అంటున్నారు. ఇంట్లో సొంతంగా పెంచుకున్న కూరగాయలు, పండ్లు తినడం ఓ అనుభూతి. ముఖ్యంగా డాబాపై చల్లదనాన్ని పంచే మొక్కలతో గార్డెన్ల ఏర్పాటుపై ప్రకృతి ప్రేమికులు ఉత్సాహం చూపుతున్నరు. ఈ నేపథ్యంలో తమ ప్రయత్నం మరెందరికో స్ఫూర్తి కావాలని ఉపాధ్యాయ దంపతులు ఆకాంక్షిస్తున్నారు.
"నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఎదైనా ఊరికి వెళ్తే అక్కడ దొరికే మొక్కలను.. అక్కడేవైనా నర్సరీలు ఉంటే ప్రత్యేకమైన మొక్కలను తీసుకువస్తాను. ఇంట్లో కంపోస్టునే మొక్కలకు ఎరువుగా వాడుతున్నాము. చాలా మందికి మిద్దె సాగులో మొక్కలు పెరుగుతాయా అనే సందేహం ఉంటుంది. సందేహం అవసరం లేదు.. మొక్కలు బాగానే పెరుగుతాయి."-ఇందిరాదేవి, ఉపాధ్యాయురాలు, సాతులూరు
బయట మార్కెట్లో లభిస్తున్న కూరగాయలకు.. ఇంట్లో పండిన కూరగాయలకు తేడా గమనించాను. మార్కెట్లో దొరికే కూరగాయలు త్వరగా పాడైపోతే.. ఇంట్లో పండినవి త్వరగా కుళ్లిపోవటం లేదు."- శివశంకర్, ఉపాధ్యాయుడు, సాతులూరు
ఇవీ చదవండి :