TDP LEADERS HOUSE ARREST : మాచర్లలో వైసీపీ శ్రేణుల మారణహోమాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు చేపట్టిన చలో నరసరావుపేట కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నరసరావుపేటకు వెళ్లకుండా పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. అయితే పోలీసులు నిర్బంధాలు చేసిన లెక్కచేయకుండా నేతలు బయటికి వచ్చి ఆందోళనలు చేశారు.
నక్కా ఆనందబాబు గృహనిర్బంధం: గుంటూరు వసంతరాయపురంలోని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు నివాసం వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయన బయటకు వెళ్లటానికి వీళ్లేకుండా పోలీసులు మోహరించారు. అయితే ఆనందబాబు మాత్రం పోలీసుల వలయాన్ని చేధించుకుని టీడీపీ కార్యాలయానికి బయలుదేరారు. పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇంటిని పోలీసులు ముట్టడించారు. పోలీసులను దాటుకుని బయటికి వచ్చిన నరేంద్ర.. తన కారులో కార్యాలయానికి చేరుకున్నారు.
సత్తెనపల్లిలో కోడెల శివరాంను, గుంటూరులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. మాచర్ల ఘర్షణ నేపథ్యంలో నరసరావుపేట వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మాచర్ల వెళ్లేందుకు అనుమతి లేదంటూ పెదకూరపాడులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిమళ్ల రమేష్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు.
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుని సైతం గృహ నిర్బంధం చేశారు. వినుకొండలోని కొత్తపేటలోని నివాసంలో జీవీని బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. తెదేపా నేతలపై జరిగిన దాడికి సంబంధించి పల్నాడు జిల్లా ఎస్పీని కలవాలని భావిస్తే.. కనీసం ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం మానుకోవాలని సూచించారు.
టీడీపీ నేత బుద్దా వెంకన్నను ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు.. ఆయన్ను అరెస్టు చేసి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. పల్నాడు జిల్లా వినుకొండలోని టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిరసన తెలిపారు.
ఇవీ చదవండి: