NO ROB TRAVELERS SUFFER WITH TRAFFIC : పిడుగురాళ్ల నుంచి జానపాడుకు వెళ్లే మార్గంలోని రైల్వే గేటుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు, చిరువ్యాపారులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక తంటాలు పడుతున్నారు. రైల్వే గేట్ వద్ద పైవంతెన నిర్మాణానికి పలుమార్లు ప్రతిపాదనలు చేసినా ఫలితం మాత్రం ఉండటం లేదు.
కాగితాలకే పరిమితమైన ప్రతిపాదనలు : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి జానపాడుకు వెళ్లే మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గంలోని రైల్వేగేటు వాహనదారులకు పెద్ద స్పీడ్ బ్రేకర్‌లా మారింది. ఒక్కోసారిగా గంటల తరబడి గేటు వద్ద నిరీక్షించక తప్పడం లేదు. ఈ గేటు సమస్య తీర్చేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ 2012 నుంచి పలుమార్లు ప్రతిపాదనలు చేసినా అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. 2017 లో ఇటు రాష్ట్రం, అటు కేంద్రం కలిపి ఆర్వోబీ నిర్మాణానికి 64 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేసినప్పటికీ ప్రయత్నం ఫలించలేదు. తాజాగా గత ఏడాది 50 కోట్లతో ప్రతిపాదనలు చేసి శంకుస్థాపన చేశారు. ఇది ఎప్పటికి ఫలిస్తుందో చూడాలి.
ప్రయాణికుల నరకయాతన.. మరణంతో పోరాటం : ప్రయాణికులు, వాహనాల రద్దీతో స్థానికులు నరకయాతన పడుతున్నారు. రోజుకు 8,9 సార్లు గంటలసేపు రైల్వే గేటు పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగురాళ్ల నుంచి జానపాడు, కారంపూడి వైపునకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. హైదరాబాద్, సిమెంట్ ప్యాక్టరీలకు వెళ్లే లారీలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. అంబులెన్సులు ఆగిపోవడంతో ఒక్కోసారి సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేక పోతున్నారు. ఒక్కోసారి క్షతగాత్రులు మరణించిన సందర్భాలున్నాయి. గర్భిణులు కాన్పు సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. గతంలో కంటే రైళ్ల రద్దీ పెరగడంతో వాహనాదారులు ఇబ్బందులు పెరిగాయి.
ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉంది : గతంలో రోజుకు లక్షా 25 వేలు ట్రాఫిక్ దాటితే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేసేవారు. ప్రస్తుతం ఇక్కడ లక్షా 40 వేలు నుంచి లక్షా 50 వేల వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉన్నందున రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు ఎక్కువ భూమిని సేకరించవలసిన అవసరం లేదని నిర్మాణానికి ఇదే తగిన సమయమంటున్నారు స్థానికులు. ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలని కోరుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి : కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పిడుగురాళ్లలో ఆర్ఓబీని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి