Kotappakonda festival : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శివనామస్మరణతో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఓం నమశ్శివాయ అని స్మరిస్తూ.. తన్మయం పొందారు. కొండ ఆసాంతం, పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. విద్యుత్ దీపాలు, ప్రభల వెలుగులో కొండకు కొత్తందాలు అల్లుకున్నాయి.
భారీగా సమకూరిన ఆదాయం... మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించిన శనివారం తిరునాళ్ల మహోత్సవంలో భక్తులు వివిధ రూపాల్లో రూ. కోటి 73లక్షల 67వేల 386 ఆదాయం త్రికోటేశ్వరునికి సమర్పించారు. ఆదివారం ఆలయాధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. వివిధ రకాల పూజ టిక్కెట్ల ద్వారా రూ.65,01,240 రాగా, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 35,00,025 సమకూరింది. అదేవిధంగా అన్నదానం కానుకల ద్వారా రూ.1,21,321, హుండీల కానుకల ద్వారా రూ.72,44,803 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారి వేమూరి గోపి తెలిపారు.
సుమారు రూ.4లక్షలు అదనం.. గత ఏడాది ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది రూ.4,30,519 ఆదాయం అదనంగా రాగా బంగారం 1.950 గ్రాములు, వెండి 367 గ్రాములు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. హుండీ లెక్కింపులో దేవాదాయశాఖ అదనపు కమిషనర్ పి.చంద్రకుమార్, ఉప కమిషనర్ ఈమని చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎండోమెంట్స్ అధికారి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామికి లింగోద్భవ అభిషేకాలు... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి కి తిరునాళ్లలో చివరి ఘట్టంగా లింగోద్భవ కాలంలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
పంచామృతాభిషేకాలు... మహాశివరాత్రి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాగారం చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేక మహోత్సవాల్లో పాల్గొని తరించారు. మరో వైపు అర్చకులు పూజాది కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగించారు. అందులో భాగంగా త్రికోటేశ్వరునికి ఆలయ అర్చకులు.. పసుపు, గంధం, కుంకుమ, వివిధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చందనాభిషేకం, భస్మాభిషేకం, కుంకుమాభిషేకం, ఫలాభిషేకం, పంచామృతాభిషేకం కనుల పండువగా జరిగాయి. అనంతరం స్వామి వారిని వివిధ పుష్పాలతో అలంకరించారు. ప్రధానార్చకులు హారతి నివేదన సమర్పించి భక్తులకు స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో వంశపారంపర్య ఆలయ ధర్మకర్త రాజా రామకృష్ణ కొండలరావు కుటుంబసభ్యులతో పాల్గొన్నారు.
ఇవీ చదవండి :