Narasaraopet Traffic Problems: పల్నాడు ముఖ ద్వారమైన నరసరావుపేటలో సుమారు రెండు లక్షల వరకు జనాభా ఉన్నారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా రహదారులు విస్తరణకు నోచుకోలేదు. కొత్తగా జిల్లాగా ఏర్పడ్డాక ట్రాఫిక్ సమస్య మరింత ఇబ్బందికరంగా మారింది. మల్లమ్మ సెంటర్, పల్నాడు రోడ్డు, ఆర్డీవో కార్యాలయం, మార్కెట్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, శివుడి బొమ్మ సెంటర్, గడియార స్తంభం, సత్తెనపల్లి రోడ్డులోని కోట సెంటర్, రైల్వేస్టేషన్ రోడ్డు ప్రాంతాలు నిత్యం రద్దీతో కిటకిటలాడుతున్నాయి. గతంలో కంటే రెట్టింపు వాహనాలు పెరిగాయి. కార్లు, ఇతర వాహనాలు మెయిన్ రోడ్డుపై వెళ్లాలంటే అరగంట సమయం పడుతుంది.
వాణిజ్య భవంతులు, దుకాణాల కింద సెల్లార్లు, పార్కింగుకు స్థలం లేకపోవడం వల్ల రహదార్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. కొత్తగా రోడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో పాటు ఉన్న పాత రోడ్లు గుంతలతో ప్రజలకు పరీక్షలు పెడుతున్నాయి. పాదచారులకు ఫుట్పాత్లు, జీబ్రా లైన్లు, ఫ్రీ లెఫ్ట్ వంటి ఏర్పాట్లు లేక వాహనదారులు, పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి రోజుకు వేలాదిమంది వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. పరీక్షల వేళ సకాలంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్రాలకు చేరుకోలేక ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి.
Traffic Problems: రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ.. ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడో..!
రహదార్ల విస్తరణకు గతంలో జరిగిన ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. గతంలో గుంటూరు రోడ్డు నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా గడియార స్తంభం వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ఇది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇలా ట్రాఫిక్ పెరిగినా రహదార్లు విస్తరణకు నోచుకోకపోవడంతో నరసరావుపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు. నరసరావుపేటలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరముంది. ట్రాఫిక్ క్రమబద్దీకరించడంతోపాటు అవసరమైన చోట్ల రహదార్ల విస్తరణ చేపట్టాల్సిన అవసరముంది.
Sand Lorry రోడ్డు ఎక్కలేక 14 గంటల పాటు ఇసుక లారీ నిలిచిపోయిన వైనం.. ఇరువైపులా ట్రాఫిక్ జామ్!
"నరసరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పడి ఏడాది దాటింది. అయినా కూడా గతంలో ఏ విధంగా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది. వాహనాలు గతంలో కంటే మూడు రెట్లు వాహనాలు పెరిగాయి. పెరిగిన వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. కార్లు, ఇతర వాహనాలు మెయిన్ రోడ్డుపై వెళ్లాలంటే అరగంట సమయం పడుతుంది. పాదచారులకు ఫుట్పాత్లు, జీబ్రా లైన్లు, ఫ్రీ లెఫ్ట్ వంటి ఏర్పాట్లు లేవు. దీంతో వాహనదారులు, పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి.. ట్రాఫిక్ క్రమబద్దీకరించడంతోపాటు అవసరమైన చోట్ల రహదార్ల విస్తరణ చేపట్టాలని కోరుకుంటున్నాము." - వాసు, నరసరావుపేట