Medical Services Under the Tree in Palnadu District: రాష్ట్రంలో ఉన్న ప్రతీ పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాం.. గతంలో కంటే ఇప్పుడు వైద్య సేవలను మరింత విస్తృతం చేశాం.. అని ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీ చోట ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పేద వాడికి మాత్రం అనుకున్న విధంగా వైద్యం అందడం లేదు.. సీఎంతో పాటుగా నాయకులు చెప్తున్న మాటలకు బయట ఉన్న పరిస్థితులకు అస్సలు పొంతన ఉండటం లేదు. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ సొంత జిల్లాలోనే ఇలా జరగడం పలు విమర్శలకు దారితీస్తోంది.
Pregnant Women Problems: ఒకచోట ఎండలో.. మరో చోట చీకట్లో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీల అవస్థలు
మూడేళ్లుగా చెట్టు కిందే వైద్య సేవలు.. రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న వెనుకబడిన గ్రామాల్లో ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య వచ్చినా.. నాగార్జున సాగర్ జలాశయం పక్కన ఉన్న విజయపురిసౌత్ కమ్యూనిటీ ఆసుపత్రే దిక్కు. కాని ఇక్కడ మాత్రం గత మూడేళ్లుగా చెట్టు కిందే వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజిని సొంత జిల్లా పల్నాడులోనే పరిస్థితి నెలకొనడం గమనార్హం. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విజయపురిసౌత్‌లో నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనం సరిపోవడం లేదని.. కొత్త భవనానికి 2021 జనవరిలో శంకుస్థాపన చేశారు. 5.32 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారు.
పెండింగ్‌లోనే 40 శాతం పనులు.. నాబార్డు నిధులతో 30 పడకల భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఏడాదిలోపు అందుబాటులోకి తీసుకురావాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. కాని ఆసుపత్రి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే నెలలో పూర్తిచేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షలో గుత్తేదారును ఆదేశించారు. కానీ పనులు జరుగుతున్న విధానం చూస్తుంటే ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మూడేళ్ల నుంచి నిర్మాణం జరుగుతున్నా ఇంకా 40 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం సాగర్ డ్యాం క్వార్టర్స్‌లో ఆసుపత్రి నడుస్తోంది. వైద్య సిబ్బంది ఆరుబయటే రోగులకు వైద్యం అందిస్తున్నారు. 10 పడకలు చెట్ల కింద వేశారు.
GGH Sanitation: పడకేసిన పారిశుద్ధ్యం.. లక్షలు పోసినా కానరాని శుభ్రత.. ఇబ్బందుల్లో రోగులు
రక్తం ఎక్కించడం, సెలైన్ పెట్టడం గాయాలతో వచ్చేవారికి డ్రెస్సింగ్ చేయడం వంటి కార్యకలాపాలన్నీ చెట్ల కిందే చేస్తున్నారు. రోజుకు 150 నుంచి 200 వరకు ఓపీ ఉంటుంది. చెట్ల నీడ ఉండబట్టి సరిపోయింది కాని అవి లేకుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని రోగులు వాపోతున్నారు. ఫార్మసీ విభాగం కూడా ఆరుబయటే ఉంది. వర్షం వచ్చిందంటే ఆసుపత్రిని మూయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మూడు గదులు ఉండగా ఒక దానిలో సహజ ప్రసవాలు చేయగా.. ఇంకో దానిలో వైద్యాధికారి ఉంటున్నారు. మిగిలిన గదిలో ఎక్స్‌రే విభాగం, మందుల స్టాక్ ఉంచుతున్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అటు వైద్య సిబ్బంది, ఇటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Lokesh on Medical Services Under the Tree: దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ జగన్ అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారిందని అన్నారు. విజయపురిసౌత్ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాంగణంలో చెట్ల కిందే రోగులకు వైద్యం అందిచడం జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందని అన్నారు.