AP Roads at Danger Situation : పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రం నుంచి అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి 9 నెలల కిందట తారురోడ్డు వేశారు. మొత్తం 11 కిలోమీటర్ల దూరం 2.06 కోట్ల నిధులతో నిర్మించారు. పాడైన రహదారిపై కొత్తది వేసే క్రమంలో గోతులు పడినచోట లూజు మట్టిని పూర్తిగా తొలగించి రోడ్డు వేయాల్సి ఉంటుంది.
అవస్థలు వర్ణనాతీతం : కానీ ఇక్కడ మాత్రం పాత రోడ్డుపైనే రహదారి వేయడంతో అంతకు ముందు గోతులున్న ప్రాంతాల్లో రోడ్డు మళ్లీ పాడైంది. రహదారి నిర్మాణంలో నాసిరకం సామగ్రి వాడటం కూడా త్వరగా దెబ్బతినడానికి కారణమైంది. దీనిని గుర్తించిన గుత్తేదారు మళ్లీ గుంతలు పూడ్చి పైపైన సరిచేశారు. అయినప్పటికీ మళ్లీ గోతులు పడుతున్నాయి. గోతులు మోకాళ్ల లోతుకుపైగా ఉండటంతో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కంకర తేలి కనిపిస్తోంది. రోడ్డు కుంగిపోయి ఎగుడుదిగుడుగా తయారైంది. గోతుల్లో వర్షపు నీరు నిలిచి వాహనాలు తిరగడం వల్ల తొందరగా దెబ్బతింటోంది. ఏళ్ల తరబడి వేచిచూసిన తర్వాత కొత్తగా రోడ్డు వేస్తే అదీ నెలల వ్యవధిలోనే పాడైందని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుత వర్షాలకు మరింత అధ్వానంగా మారడంతో వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వారు సైతం రాత్రివేళ గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఆందోళన చేస్తే.. అక్రమకేసులు : కృష్ణా నది నుంచి పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇసుక తరలించే క్రమంలో ఈ మార్గంలో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇసుకతో లారీలు రాకపోకలు సాగించడంతో రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమవుతున్నాయి. గ్రామీణ రహదారుల్లో అంతటి భారీ లారీలు తిరుగుతుండటంతో రోడ్డు ఎక్కడికక్కడ కుంగిపోయింది. నిర్మాణంలో లోపం ఉన్నచోట భారీ గోతులు పడుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణాలో భాగస్వాములు కావడంతో స్థానికులు లారీలను అడ్డుకోలేని పరిస్థితి.
రోడ్లు పాడవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఇసుక లారీలు ఆపాలని ఆందోళన చేస్తే... తమపైనే అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రహదారుల, భవనాలశాఖ నిబంధనల ప్రకారం ఒకసారి రోడ్డు నిర్మిస్తే ఐదేళ్ల వరకు మళ్లీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయరు. ఇటీవలే వేసిన రహదారి కాబట్టి ఐదేళ్ల వరకూ నిధులు రావు. దీంతో పాడైన రహదారిలోనే స్థానికులు నాలుగేళ్లపాటు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.ఈ రహదారిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తిస్తామని రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. గోతులు పడిన చోట మరమ్మతులు చేయిస్తామన్నారు. రెండేళ్ల వరకు గుత్తేదారు నిర్వహణ చేపట్టాల్సి ఉందని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.