Young Couples died in Road Accident: పెద్దలను కాదని వారి ప్రేమను గెలుపించుకోవటానికి.. ఎదురించి వివాహం చేసుకున్న జంటను విధి వక్రీకరించింది. వివాహం చేసుకున్న ఐదు సంవత్సరాలకే వారి జంటకు నూరేళ్లు నిండిపోయాయి. రోడ్డు ప్రమాదం మింగేసిన ఆ దంపతులకు ఓ కుమార్తె ఉండగా.. విధి ఆడిన వింత నాటకంలో అభం శుభం తెలియన నాలుగు సంవత్సరాల ఆ పాప అనాథగా మారాల్సి వచ్చింది. ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్తున్న ఆ భార్యభార్తల వాహనాన్ని ఫ్లయాష్ ట్యాంకర్ ఢీకొనడంతో.. వారి ప్రాణాలు ప్రమాద స్థలంలోనే గాల్లో కలిశాయి. ప్రమాద స్థలంలో ఆ చిన్నారి ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన సిద్ధంశెట్టి రాధాకృష్ణకు పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన గ్రామానికి చెందిన లీలారాణితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమ విషయం పెద్దలకు తెలిసి కులాలు వేరు కావటంతో వారు వివాహనికి ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను కాదని వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మధిర పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వారు సంతోషంగా జీవిస్తున్న కాలంలోనే.. వారి సంబరానికి మరింత తోడుగా వివాహమైన సంవత్సరానికే కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెతో దంపతిలిద్దరి జీవితం ముందుకు సాగుతోంది. కానీ, ఇంతలోనే వారి సంతోషాన్ని విధి మింగేసింది. రోడ్డు ప్రమాదం వారి జీవితాలను మింగేసి.. చిన్నారిని అనాథను చేసింది. ఆ దంపతులు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిద్ర చేయాలని అనుకున్నారు. అందుకోసం మధిర నుంచి ఆ దంపతులు కుమార్తెతో సహా స్కూటిపై బయల్దేరారు. చిల్లకల్లు సమీపంలోకి రాగానే వారి స్కూటిని ఫ్లయాష్ ట్యాంకర్ వేగంగా ఢీకొట్టింది.. ట్యాంకర్ టైర్ల కిందపడి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జయ్యాయి.
స్కూటిపై నుంచి దూరంగా పడిపోయిన చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. విగతా జీవులుగా పడిఉన్న తల్లిదండ్రులను పిలుస్తూ.. నాలుగేళ్ల చిన్నారి రోధించిన తీరు అక్కడ ఉన్న వారిని కలచివేసింది. సమాచారం అందుకున్న వత్సవాయి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు.