Vinayaka Chavithi Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చతుర్థి శోభ నెలకొంది. ఆది దేవుడైన గణనాధునికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. అనంతపురం జిల్లా పామిడిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగతేజ రకరకాల చాక్లెట్లతో వినాయకున్ని తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. నిమిజ్జనం రోజున చాక్లెట్లను భక్తులకు పంచుతామని తెలిపారు.
నెల్లూరుకు చెందిన గిన్నిస్ రికార్డు గ్రహీత, చిత్రకారుడు అమీర్ జాన్ మరోసారి ప్రతిభను చాటుకున్నారు. మొక్కజొన్న కంకిపై 666 వినాయక బొమ్మలను చిత్రీకరించి ఔరా అనిపించారు. ఆక్రీలిక్ కలర్స్, మైక్రో బ్రష్‌లు ఉపయోగించి 6 గంటలపాటు శ్రమించి గణనాథులను తీర్చిదిద్దారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కోసమే వినూత్న ప్రయత్నమని తెలిపారు. ప్రజలంతా పీవోపీ విగ్రహాలు పక్కన పెట్టి.. మట్టి గణపతి ప్రతిమలను పూజించాలంటూ.. సేవా సంస్థలు పిలుపునిచ్చాయి.
మానవ సమాజ భద్రత, బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో నగరవాసులకు ఉచితంగా మట్టి గణనాధుడి విగ్రహాలు పంపిణీ చేశారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలోనూ లంబోదరుడి విగ్రహాలు అందించారు. పత్రిగా వినియోగించే 21 రకాల మెుక్కలను ప్రదర్శనకు ఉంచి ప్రజలకు అవగాహన కల్పించారు. నందిగామ గాంధీ సెంటర్‌లో 7 రకాల విత్తనాలతో కలిపి తయారు చేసిన 2వేల 700 మట్టి వినాయక విగ్రహాలను ఏసీపీ జనార్ధన్ నాయుడు పంపిణీ చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో నిస్వార్థ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంచారు. విశాఖ జిల్లా భీమునిపట్నం సీఐ రమేశ్ 500 మట్టి విగ్రహాలతోపాటు వినాయక వ్రతకథా పుస్తకాలు భక్తులకు అందజేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు శ్రీకాకుళంలో మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్ 20 వేల మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేశారు.
మట్టి గణపతిని పూజించండి.. పర్యావరణ కాపాడండి అంటూ విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మానేపల్లి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వివిధ రకాల ఆకృతులలో మట్టి గణపయ్య విగ్రహాలు తయారు చేశారు. మైదాపిండి ఇతర రకాల పదార్థాలతో నీటిలో కరిగిపోయే విధంగా ప్రతిమలు రూపొందించి ప్రజలకు అందించారు. మట్టి గణపతులతో ముమ్మిడివరంలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
విశాఖలోని శ్రీప్రకాష్ పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. మట్టి, పసుపు, పిండి, ఆకులు, డ్రై ఫ్రూట్స్.. ఇలా వివిధ పదార్థాలతో వినూత్నంగా బొజ్జ గణపయ్యను తయారు చేసి విద్యార్థులు నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. లంబోదరుడి విగ్రహాలు, పత్రి, పూలు, పండ్లు కొనేందుకు వచ్చిన వినియోగదారులతో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్‌నజీర్, సీఎం జగన్ వినాయకచతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఆటంకాలు తొలగించి, ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించారు.