Tummalapalli Kalakshetra renamed by the ycp Govt: విజయవాడలో దశాబ్దాల చరిత్ర కలిగిన 'తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం' పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య అనే పదాలు తీసేసి.. "కళాక్షేత్రం" అని మాత్రమే ఉంచింది. కళలను బతికించాలనే సదాశయంతో కృష్ణా నది కాలువ పక్కనే స్థలమిచ్చిన దాతకు.. ప్రభుత్వ చర్య తీరని అవమానమని కళాకారులు, కళాభిమానులు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కట్టడాలకు ఒక్కొక్కటిగా మహనీయుల పేర్లను తొలగిస్తుండటం దారుణమని మండిపడుతున్నారు.
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా విశాలమైన స్థలంలో కళాప్రదర్శనల కోసం కళాక్షేత్రం నిర్మించాలనే ప్రణాళికలు రూపొందించి.. 1953లో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి శిలాఫలకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతంలో కళా ప్రదర్శనల కోసం ఉన్న అతిపెద్ద ఆడిటోరియం ఇదే. నగరానికి చెందిన డాక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు.. ఆడిటోరియం నిర్మాణం కోసం ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. ఆయనకు గుర్తుగా తుమ్మపల్లి వారి మున్సిపల్ ఆడిటోరియంగా నామకరణం చేశారు. ఆ తర్వాతి కాలంలో ప్రముఖ వాగ్గేయకారుడు క్షేత్రయ్య పేరును జోడించి.. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంగా మార్పు చేశారు. ఇప్పటివరకూ అదే పేరు కొనసాగుతోంది.
తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని 2003లో 50 లక్షలతో ఆధునికీకరించారు. ఆ తర్వాత 2015లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు.. తుమ్మలపల్లి కళాక్షేత్ర అభివృద్ధికి 2 కోట్ల నిధులు అందించారు. ఈ సొమ్ములతో పాటు మరో 8 కోట్లు ఖర్చు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. 2016 పుష్కరాలకు ముందు కళాక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో ఆధునికీకరించింది. సౌండ్ సిస్టమ్‌తో పాటు సీటింగ్, ఏసీలు, పచ్చదనం అభివృద్ధి చేసి.. భవనం రూపురేఖలను మార్చేసింది.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతి లేని లోటు కనిపించకుండా.. అందంగా ముస్తాబు చేసింది. అంతకుముందు 1.4 ఎకరాల్లో కళాక్షేత్రం ఉండగా, పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని కలిపి రెండు ఎకరాలకు పెంచింది. భవనం వెనుక విశాలమైన పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసింది. ఆధునిక పరిజ్ఞానంతో లైటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దింది. ఎన్ని మార్పులు చేసినా, అలనాటి జ్ఞాపకాలు చెరిగిపోకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆడిటోరియం వెలుపల ఉన్న మహనీయుల విగ్రహాలను యధాతథంగా ఉంచింది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. గతేడాది కోటి రూపాయల ఖర్చుతో మరోసారి కళాక్షేత్రాన్ని ఆధునికీకరించారు. భవనం వెలుపలి వైపు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అప్పట్లోనే తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య అనే పదాలు తొలగించి.. కళాక్షేత్రం పేరు మాత్రమే ఉంచారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ పేరును కూడా మార్చాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కళాక్షేత్రం అనే పేరు ఉంచినా.. భవిష్యత్తులో మార్చాలనే యోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును YSR ఆరోగ్య వర్సిటీగా ప్రభుత్వం మార్చేసింది. తాజాగా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం అత్యంత దారుణమని.. పాత పేరును పునరుద్ధరించాలని కళాకారులు, కళాభిమానులు కోరుతున్నారు.
ఇవీ చదవండి