Vijayawada Municipal Corporation Negligence: విజయవాడలో ఖాళీ స్థలాల వివరాలు వీఎంసీలో లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఖాళీ స్థలాల యజమానులును గుర్తించి పన్నులు వసూలు చేయాల్సిన పాలక మండలి ఆ పని చేయడం లేదు. ఖాళీ స్థలాలు పల్లంగా ఉండడంతో పిచ్చిమెుక్కలు పెరిగి, వర్షపు, మురుగు నీరు చేరి చుట్టుపక్కల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ నిల్వ నీళ్లలో పాములు, విష పరుగులు వంటివి నివసిస్తున్నాయని నగర ప్రజలు చెబుతున్నారు.
ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుడి నుంచి రికార్డుల్లో పేరు మార్పుకోసం మ్యుటేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే మున్సిపల్ రికార్డులలో మాత్రం ఆస్తి కొనుగోలుదారుని పేరు మీదకు మారదు. మున్సిపల్ రికార్డులలో పేరు మారాలంటే మరోసారి ప్రతి లక్ష రూపాయలకు 250 రూపాయల చొప్పున ఆస్తివిలువ ఎంతైతే ఉంటుందో అంత ఫీజు కార్పొరేషన్‌కు చెల్లించాలి.
అలా ఫీజు చెల్లించి ఎవరైనా రికార్డులలో పేరు మార్చుకుంటే వారి వివరాలు నమోదు అవుతాయి. మార్చుకోకపోతే వారి వివరాలు నమోదు కావు. మార్చుకున్న వారూ వారి అడ్రసు మారితే వారెక్కడ ఉన్నారో కూడా కార్పోరేషన్‌కు తెలియదు. ఫలితంగా ఆ ఖాళీ స్థలాల అభివృద్ధి కోసం, వాటి యజమానులను గుర్తించే అవకాశం కార్పొరేషన్‌కు లేకుండా పోయింది.
ప్రాణాలు తీస్తున్నా మొద్దు నిద్ర వీడని అధికారులు - అధ్వానంగా విజయవాడ డ్రైనేజీ వ్యవస్థ
స్థల యజమానులకు నోటీసులు పంపి వాటిని శుభ్రం చేయమని చెప్పడానికి కూడా వీఎంసీ దగ్గర వివరాలు లేకపోవడంతో నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమో, పాలక మండలి నిర్లక్ష్యం వల్లే నగరవాసులు అవస్థలు పడుతున్నారని ట్యాక్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాల అభివృద్ధి, యజమానులను గుర్తించే అవకాశం కార్పోరేషన్‌కు లేకుండా పోయిందని వాపోతున్నారు.
ఓ ఇంటికి ఆస్తి పన్ను చెల్లించకపోతే జప్తు నోటీసు పంపే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంది. కానీ ఖాళీ స్థలాల పన్ను చెల్లిస్తున్నారా లేదా అడగటానికి కూడా కార్పొరేషన్ వద్ద సంబంధిత వివరాలు లేవు. స్థలం, ఇంటి రిజిస్ట్రేషన్ వివరాలు, యజమానుల పేర్లు స్థానిక సంస్థలో నమోదు చేయకపోవడం లాంటి అంశాలు ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమని ట్యాక్స్ అసోసియన్ నాయకులు చెబుతున్నారు. నగరంలోని అన్ని ఆస్తులకు పరిపాలనా విభాగంగా ఉన్న కార్పొరేషన్ వద్ద ఎటువంటి డాటా లేకపోవడం బాధాకరమన్నారు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు కిందిస్థాయి ఉద్యోగుల మీద నెట్టి వేస్తున్నారని మండిపడ్డారు. డేటా బేస్‌ను నిర్వహించాలన్న ఆలోచన కార్పొరేషన్ అధికారులకు లేదని విమర్శిస్తున్నారు. ఈ సమస్యలపై వీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నగరవాసులకు కావాల్సిన సౌకర్యాలు చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఉందని, తగిన చర్యలు చేపట్టి ఖాళీ స్థలాల వివరాలు సేకరించి ప్రజల పడుతున్న అవస్థలు నిర్మూలించాలని ట్యాక్స్ అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు.