Vijayawada Metro Rail Project : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు. దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, ఎలా తొక్కి పెట్టాలన్నదానిపైనే మొదటి నుంచీ దృష్టి పెట్టింది. విభజన చట్టం ప్రకారం కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి హక్కుగా సాధించుకోవలసిన మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలకు అంచలంచెలుగా తూట్లు పొడుస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ గ్రామీణ మండలంలోని ఎనికేపాడు గ్రామం పరిధిలో 3 వేల 272.55 చదరపు గజాల భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విస్తీర్ణం చూడటానికి చిన్నదిగానే కనిపించినా.. ఈ భూసేకరణ ఇక లేదని చెప్పడం ద్వారా, అసలు మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టకూడదన్న ప్రభుత్వ ఉద్దేశం బయటపడుతోంది. దీంతో విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించినట్టే అవుతోంది.
భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్ : గత ప్రభుత్వం 2017లో మెట్రో రైల్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిలో భాగంగా ఎనికేపాడు పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలోని 3 వేల 272.55 చదరపు గజాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. వాటిలో కొంత గ్రామకంఠం భూమితో పాటు, వివిధ వ్యక్తులకు చెందిన ఇళ్ల స్థలాలున్నాయి. ఆ భూ సేకరణ ప్రతిపాదన రద్దు చేస్తూ కలెక్టర్ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జారీ చేసిన భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్ గడువు 2019లోనే ముగిసిందని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మెట్రోరైల్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే అప్పుడు మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ పరిధిలో ఉండటం వల్ల ఆ స్థలాల యజమానులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే రద్దు చేశామని తెలిపారు. నోటిఫికేషన్ రద్దు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ మెట్రోరైల్ కార్పొరేషన్ కూడా స్పష్టం చేసినట్టు తెలిపారు.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయమేదీ తీసుకునే ఆలోచనలో లేదని దీన్నిబట్టే అర్ధమవుతుంది. ఎంతో అధ్యయనం, కసరత్తు చేసి విజయవాడ మెట్రోరైల్ మార్గాన్ని గత ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే భూసేకరణకు ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ భూమిని భూసేకరణ నుంచి తప్పిస్తే వాటి యజమానులు అక్కడ భవనాలు నిర్మించుకోవచ్చు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వచ్చి మెట్రో రైల్ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అప్పుడు అక్కడ భూసేకరణ చేయగలదా? ఒకసారి భవనాలు నిర్మించుకున్నాక భూసేకరణ చాలా సంక్లిష్టంగా అవుతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు.
అసెంబ్లీలో అలవోకగా అబద్ధాలు : విజయవాడలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకేనని కొన్ని నెలల క్రితం అసెంబ్లీలో జగన్ అలవోకగా అబద్ధాలు చెప్పారు! వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో విజయవాడలో చేసిన అభివృద్ధి ఏంటి? మెట్రో ప్రాజెక్టుకి తూట్లు పొడవడమా? ఇప్పటికే విజయవాడలో భాగంగా ఉన్న గొల్లపూడి, పెనమలూరు, గన్నవరం వంటి ప్రాంతాల్ని కలిపి గ్రేటర్ విజయవాడగా చేయాల్సింది పోయి నగరంలో భాగంగా ఉన్న ప్రాంతాల్ని ప్రత్యేక మున్సిపాలిటీలుగా చేయడమా? విజయవాడ నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న ప్రాంతాల్ని, విజయవాడకు అత్యంత సమీపంలోని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్ని కలిపితే జనాభా 25 లక్షలకుపైనే ఉంటుంది.
తీరని ట్రాఫిక్ కష్టాలు : రాష్ట్ర విభజన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాలకు మెట్రో రైలు ప్రాజెక్టు అత్యవసరం. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఫ్లై ఓవర్లు కట్టినా ఇప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. రాబోయే రోజుల్లో నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరగనున్నందున ప్రజలు సుఖంగా, సౌకర్యవంతంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో రైలు వంటి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ తప్పనిసరిగా కావాలి. మెట్రో రైల్‌ని కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఉపయోగపడే రవాణా సదుపాయంగా మాత్రమే చూడకూడదు.
విజయవాడపై కక్ష : మెట్రో రైలు వంటి భారీ ప్రాజెక్టు వస్తే నిర్మాణ వ్యయంలో సుమారు 38 నుంచి 40 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వెళుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. మెట్రో మార్గంలోని ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. మెట్రో రైల్లో ప్రయాణం అంటే విలాసం కాదు. ఉద్యోగులకో, ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడేదీ కాదు. చిరుద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్లే పేద వర్గాలకూ మెట్రో రైలు ఎంతో ఉపయుక్తం. ఇన్ని ప్రయోజనాలున్న మెట్రో రైలు ప్రాజెక్టుకి జగన్ ప్రభుత్వం పాతరేయడం విజయవాడపై కక్ష కాకపోతే మరేంటి అని ప్రశ్న వినిపిస్తోంది.
మెట్రో రైల్ పాలసీ : రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా, విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి, ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని.... విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులపై విస్తృత కసరత్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపింది. కేంద్ర ప్రభుత్వం 2017 మెట్రో రైల్ పాలసీ ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రానికి సూచించింది. దానిపై కసరత్తు జరుగుతుండగానే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. అక్కడితో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకి ఉరితాడు బిగించడం మొదలైంది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఇంత వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపలేదు.
31 మంది ఎంపీలు.. ఎందుకో? : "మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, సమగ్ర రవాణా ప్రణాళిక, వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక వంటివి సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకి కొత్త మెట్రో రైల్ పాలసీ -2017 ప్రకారం సవరించిన ప్రతిపాదనలు పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 2017 సెప్టెంబరు 1న కోరామని ఇంత వరకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదు" అని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి 2022 డిసెంబరు 12న రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ సాధించుకొస్తానని చెప్పిన జగన్ ఆయన పార్టీకి లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 31 మంది ఎంపీలున్నా విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. అసలు ప్రతిపాదన పంపడమే ఇష్టంలేని జగన్ ప్రభుత్వం ఇక ఒత్తిడేం తెస్తుందని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
జార్ఖండ్..ఒడిశా..ఏపీ : ఇంత వరకు మెట్రో రైళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలే ఉన్నాయి. ఈ విషయంలో ఏపీని అత్యంత వెనుకబడిన రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. జమ్ము, శ్రీనగర్, నాసిక్, ఠానే వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోను మెట్రో రైళ్ల ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. డెహ్రాడూన్, గోరఖ్‌పూర్ వంటి చిన్న నగరాలూ పోటీ పడుతున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం మెట్రో ప్రతిపాదనలన్నింటినీ అటకెక్కించింది.
ఇవీ చదవండి