Vijayawada Govt Hospital diet contract Updates: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టు టెండర్ల విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నారు. ఏటా ప్రభుత్వం నుంచి 3 కోట్ల రూపాయల వరకు బిల్లులు వచ్చే కాంట్రాక్టు కావడంతో పెద్ద స్థాయిలో లాబీయింగ్ జరుగుతోందని సమాచారం. రాష్ట్ర కీలక మంత్రి ఆశీస్సులతో ఒకరు, పక్క జిల్లాకు చెందిన ఓ ఎంపీ సిఫార్సులతో మరొకరు కాంట్రాక్టు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏడు సంస్థలు టెండర్లు దాఖలు చేసినప్పటికీ.. ఆ ఇద్దరిలో ఒకరికి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
విజయవాడ కొత్త, పాతాసుపత్రుల డైట్ కాంట్రాక్టు గడువు ఏడాది కిందటే ముగిసిపోయింది. ఎట్టకేలకు డైట్ కాంట్రాక్టు కోసం తాజాగా టెండర్లు పిలవగా.. తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోందని సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రి డైట్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే.. నిబంధనల ప్రకారం టెండర్‌దారులపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. కనీసం ఐదేళ్లు డైట్ కాంట్రాక్టు చేసిన అనుభవం ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించిన జీఎస్టీ, ఐటీ సహా అన్నీ పక్కాగా చెల్లించి ఉండాలి. ఇప్పటికే ఆసుపత్రుల్లో నిర్వహించిన డైట్ కాంట్రాక్టు పైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించి ఉండాలి. అయితే కొందరు అతితెలివితో వైద్యులకు పెట్టే ఆహారానికి సంబంధించి వచ్చే బిల్లులకు మాత్రమే పన్ను చెల్లించి.. రోగులపైన వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించడం లేదు. రోగులపైన వచ్చే ఆదాయమే ఎక్కువ ఉంటుంది. గుత్తేదారులు గతంలో పనిచేసిన ఆసుపత్రుల్లో ఆహారానికి సంబంధించి ఎక్కడా మెమోలు, షోకాజ్ నోటీసులు తీసుకుని ఉండకూడదు. ఈ నిబంధనలకు అనుగుణంగా టెండరుదార్లు ఉన్నారో లేదో చూడాలి. తరువాతే టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లకు సంబంధించిన సీల్డ్ కవర్లలో తక్కువకు కోట్ చేసిన వారికి అవకాశం ఇవ్వాలి.
టెండరు నిబంధనల్లో అత్యధిక మార్కులతో ఎవరైనా సమానంగా ఉంటే లాటరీ ద్వారా గుత్తేదారును ఎంపిక చేస్తారు. మార్కులు తక్కువ వచ్చిన వారిని ముందే అనర్హులుగా పక్కన పెడతారు. అయితే.. తాజాగా టెండర్లు దాఖలు చేసిన వారిలో ఒక గుత్తేదారును తెలంగాణలో బ్లాక్ లిస్టులో పెట్టినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సిఫార్సులతో ఈసారి ఇక్కడ టెండర్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని సదరు గుత్తేదారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిబంధనలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధుల సిఫార్సులకే పెద్దపీట వేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. అలా జరిగితే.. రోగులకు అందించే ఆహారంలో నాణ్యత తగ్గిపోతుంది. గుత్తేదారుకు ప్రభుత్వం చెల్లించే బిల్లుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పరోక్షంగా రోగులకు నష్టం జరుగుతుంది.
ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో డైటీషియన్ లేరు. గుంటూరు ఆసుపత్రి నుంచి డైటీషియన్‌ను తీసుకొచ్చి టెండర్లు ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి డైట్ విషయమే కొన్నాళ్లుగా న్యాయస్థానంలో నానుతోంది. కోర్టు నుంచి స్టే తీసుకొచ్చిన గుత్తేదారే.. నాలుగైదేళ్లుగా అక్కడ కొనసాగుతున్నారు. అలాంటి సమయంలో అక్కడి ఆసుపత్రి నుంచి డైటీషియన్‌ను తీసుకొచ్చి టెండర్లు తెరిపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిఫార్సులతో టెండరు దక్కించుకోవాలని చూస్తున్న ఓ గుత్తేదారుకు మేలు చేసేందుకే ఇలా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విజయవాడ ప్రభుత్వాసుపత్రి డైట్ కాంట్రాక్టు.. నిబంధనల మేరకు అన్ని అర్హతలున్న గుత్తేదారు దక్కించుకుంటారో.. సిఫార్సులతో వచ్చిన టెండరుదారును ఎంపిక చేస్తారో.. తెలియాలంటే కాస్త వేచి చూడాలి.
ఇవీ చదవండి