CM Thiruvuru tour Updates : సీఎం జగన్ తిరువూరు పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. దీని కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి తిరువూరుకు చేరుకుంటారు. పోలీసులు మాత్రం సీఎం వస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. జగదల్‌పుర్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి ఆదివారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దారి మళ్లించారు. ఎనిమిది గంటలు పాటు జాతీయ రహదారిపై రాకపోకలు సాగవు. నిత్యం జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలకు ఆదివారం ఇక్కట్లు తప్పవు.
వాహనాల దారి మళ్లింపు : మైలవరం నుండి ఖమ్మం వెళ్ళవలసిన వచ్చే వాహనాలను చీమలపాడు సెంటర్ నుండి వయా గంపలగూడెం, చింతలపాడు,మునుకోళ్ల, మీదుగా కల్లూరు నుండి ఖమ్మం వైపు మళ్లించారు. మైలవరం నుండి భద్రాచలం వెళ్లే వాహనాలను ఏ. కొండూరు అడ్డ రోడ్ నుండి వయా విసన్నపేట, నర్సాపురం, వేంసూర్ మీదుగా సత్తుపల్లి వైపు దారి మళ్లించారు. భద్రాచలం నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలను కల్లూరు, నుండి వయా పేరువంచ, మునుకుళ్ల , చింతలపాడు, గంపలగూడెం మీదుగా చీమలపాడు నుండి మైలవరం మీదుగా విజయవాడ వైపు మళ్లించారు. దీంతో వాహనాలు చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంది.
అధికారులు అత్యుత్సాహం : తిరువూరు బైపాస్ రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం పక్కన గల ఖాళీ ప్రదేశంలో సభా వేదిక సిద్ధం చేశారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్ హెలికాప్టర్‌లో తిరువూరు వాహినీ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు ఉదయం 10.35కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి సుగాలి కాలనీ, ఎంపీడీవో కార్యాలయం వీధి, పట్టణ ప్రధాన రహదారి మీదుగా 15 నిమిషాల్లోనే రోడ్డు మార్గంలో సభా స్థలికి చేరుకుంటారు.
ఈ కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి మధ్యాహ్నం 12.30కు బయలుదేరి పది నిమిషాలలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మొత్తం పర్యటనలో జాతీయ రహదారిపై ప్రయాణం అరగంటకు మించి లేదు. ఆ సమయంలో లక్ష్మీపురం, ముత్తగూడెం చెక్‌పోస్టు వద్ద కొద్దిసేపు వాహనాలను నిలిపితే సరిపోతుంది. అధికారులు అత్యుత్సాహంతో వాహనదారులను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మళ్లింపుల పేరుతో ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రణాళికలు రూపొందించడంపై విమర్శలకు దారితీస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాయకుల గృహ నిర్బంధం : సీఎం జగన్ తిరువూరు పర్యటన సందర్భంగా తిరువూరులో పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. , తిరువూరులో సీపీఐ నాయకుడు డేవిడ్, విస్సన్నపేటలో ప్రజాసంఘాల నాయకుడు జయకరబాబు గృహ నిర్బంధం చేశారు. గంపలగూడెంలో ప్రజా సంఘాల నాయకుడు నాగరాజు ముందస్తు అరెస్టు చేశారు.
కిడ్నీ బాధితుల కష్టాలు : ఏ కొండూరు మండలం రేపూడి తండా గిరిజన సంఘం నేత బి. గోపిరాజు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం జగన్ పర్యటన అడ్డుకుంటారన్న అనుమానంతో తిరువూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై సీఎం పర్యటనలో నిరసన ఉంటుందని ఏ కొండూరు మండలంలోని గిరిజనులు దళితులు బీసీలు వర్గాల కిడ్నీ బాధితుల కష్టాలు పరిష్కారం చేయాలని సభలో ఆందోళన చేస్తారని ఉద్దేశంతో గిరిజన సంఘం నేతను హౌస్ చేశారు.
పోలీసుల మెడలో జగన్ ఫోటో : సీఎం సభాస్థలి వద్ద పోలీసులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఏర్పాటు చేశారు. అవి చూసిన వారు ఆర్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు పోలీసులు మెడలో ధరించారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులు తప్పక గుర్తింపు కార్డులు ధరించాలని, మీడియా చిత్రీకరిస్తే కార్డు వెనక్కి తిప్పాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
సభ వద్దకు కాలానడకన విద్యార్థులు : సీఎం జగన్ పర్యటన నేపధ్యంలో సభ ప్రాంగణానికి వచ్చే వారిని తిరువూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో బస్సులు నిలిపి వేశారు. దీనితో విద్యార్థులు, ప్రజల కాలానడకన చేరుకునేందుకు అవస్థలు పడ్డారు. కాలినడకన గమ్యస్థానాలకు ప్రయాణికులు వెళ్లారు. వర్షం తగ్గుముఖం పట్టి ఎండ వస్తుండటంతో నాయకులూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి