GST Collection Harassment: జీఎస్టీ గందరగోళం సహా వాణిజ్య పన్ను వసూళ్ల వేధింపులపై ట్రేడర్లు ప్రభుత్వాన్ని నిలదీశారు. విజయవాడలో నిర్వహించిన ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో వ్యాపారులు, డీలర్లు ఆ శాఖ మంత్రి బుగ్గన, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల సమక్షంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వ్యాపారులను రసగుల్లాల్లా భావించి పన్నులు పిండుతున్నారని ఆక్షేపించారు.
పన్ను వసూళ్లు లలో ఏమాత్రం పారదర్శకత లేదని డీలర్లు, ట్రేడర్లు ఆక్షేపించారు. ప్రభుత్వం వ్యాపారస్తులను చూసే దృష్టి కోణం మారాలని తేల్చి చెప్పారు. పన్నుల శాఖ నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పెనాల్టీలు ఎందుకు కట్టాలని వ్యాపారులు నిలదీశారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఆదాయం కోసం వ్యాపారులను వేధిస్తారా అని నిలదీశారు. పొరుగు రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
వాణిజ్య పన్నుల అధికారుల తీరు సరిగాలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా బంగారం దుకాణాలు తరుగు పేరిట వినియోగదారులను దోచుకుంటున్నాయని మంత్రికి ఫిర్యాదు చేశారు. అనవసరంగా పన్నులు కడుతున్నాం అనే భావన వ్యాపారుల్లో ఉండటం సరికాదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధన మాన, ప్రాణ రక్షణ కోసమే ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని గుర్తించాలని అన్నారు.
పన్ను వసూళ్లకు సంబంధించి ఎలాంటి టార్గెట్లూ లేవన్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించి త్వరలోనే డేటా అనలిటిక్స్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాపారులు పన్ను ఎగవేస్తున్న ఫిర్యాదులు తమ వద్ద పెద్దఎత్తున ఉన్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్పష్టం చేశారు. వీటిని అడ్డుకునేందుకు ఏం చేయాలంటూ వ్యాపారులను ప్రశ్నించారు.
ఇవీ చదవండి: