High Court on MGNREGA Funds : ఉపాధి హామీ పథకం నిధులను గ్రామ సర్పంచ్ దుర్వినియోగం చేయటంపై.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఖాతా కింద ఉపాధి పనులు చేపట్టినందుకు బకాయిలు చెల్లించాలని.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన రమేశ్‌బాబు అనే వ్యక్తి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషనర్‌కు సొమ్ము చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో రమేశ్‌బాబు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.
కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు అందాల్సిన సొమ్మును బంధువులకు అందించారని వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. విఠలాపురం గ్రామ సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి దుర్వినియోగం చేశారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ నిధులు దుర్వినియోగ చేశారని మీరే చెప్తున్నప్పుడు సర్పంచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
ఇవీ చదవండి :