TDP future guarantee bus tour: జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నాశనమైపోతోందని చంద్రబాబు నాయుడు మాత్రమే కాపాడగలుగుతారని తెలుగుదేశం నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు భవిష్యత్ కు గ్యారెంటీ చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేత కాల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం కుందుర్పిలో భవిష్యత్తుకు గ్యారంటీ బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాలవ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి భావి తరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కు వెళ్లిందని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో నాయకులు మనస్పర్ధలు వదిలేసి కలిసి పనిచేసి సైకిల్‌ను అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టోను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం కోసమే బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం నేత కేఎస్ జవహర్ వెల్లడించారు. కౌరవ సభలో ఉన్న అసెంబ్లీలో.. ముఖ్యమంత్రిగా ప్రవేశిస్తానని చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాన్ని ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు ముఖ్యంగా మహిళలకు చేరవేసేలా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని జవహర్ కోరారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెదేపా నేతలు బస్సుయాత్ర ప్రారంభించారు. కారంపూడి మండలం పేటసన్నెగండ్ల నుంచి ప్రారంభమైన చైతన్య రథయాత్ర మాచర్ల వరకు ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు జీవి ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. చైతన్య రథయాత్రకి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్ర నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోట సత్తమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కాలంలో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటుగా.... అంబేడ్కర్ సామాజిక భవనం వద్ద, నిర్మాణాలు పూర్తికాని టిట్కో ఇళ్ల వద్ద, ఆర్టీసీ బస్ డిపో వద్ద మాజీ శాసనసభ్యులు శేషారావు సెల్ఫీ చాలెంజ్ చేశారు.
గాజువాక లో భవిష్యత్ కు గ్యారెంటీ చైతన్య యాత్ర జోరుగా సాగుతొంది. గాజువాక నుంచి అగనంపూడి టోల్ గేట్ వరకు టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ చేశారు. అగనంపూడి టోల్ గేట్ వద్ద టీడీపీ నేతలు సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగుదేశం హయంలో టోల్ గేట్‌పై.. హై కోర్టు వరకు వెళ్లి నిలుపు చేసామన్నారు. ప్రస్తుత వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే కమిషన్లకు కక్కుర్తి పడి టోల్ గేట్ నిర్వహిస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టోల్ గేట్ తొలగిస్తామని ఆయన వెల్లడించారు.