TDP Sand Satyagraham Protest Leaders House Arrest: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు అక్రమ ఇసుక దందాలు, మట్టి దందాలు, గ్రానైట్ దందాలకు తెరలేపారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, రవాణాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. వైసీపీ నాయకుల అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ.. ‘ఇసుక సత్యాగ్రహం’ పేరుతో గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మరికొంతమంది నేతలను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Police Arrested TDP Leaders: 'ఇసుక సత్యాగ్రహం' పేరుతో రెండు రోజులక్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ నేతలు పిలుపునివ్వడంతో.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐడీ కార్డు ఉంటేనే ఉద్యోగులను లోపలకు పంపించారు. ప్రధాన కూడలి సహా ఎక్కడికక్కడ భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. ముట్టడిలో టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నకుండా గృహ నిర్బంధం చేశారు.
Devineni Uma Fire on CM Jagan: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి సిద్ధమైన మాజీమంత్రి దేవినేని ఉమాను పోలీసులు గృహనిర్భంధం చేశారు. అంతేకాకుండా, అర్ధరాత్రి నుంచి గొల్లపూడిలోని ఆయన ఇంటి వద్ద పహారా కాశారు. దాంతో పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహించిన దేవినేని ఉమా.. గొల్లపూడిలో తన ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆనాడు ఉప్పు సత్యాగ్రహం గాంధీ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
Police Arrested Tangirala Soumya: ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వటానికి వస్తున్న నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. రాఖీ పండగ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాఖీ కట్టి, పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సంబరాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై గుంటూరు జిల్లాలో తెలుగుదేశం చేపట్టిన ఆందోళనలపై.. పోలీసులు ఆంక్షలు విధించారు. వసంతరాయపురంలోని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నెల్లూరు జిల్లాలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నకుండా మాజీ మంత్రి సోమిరెడ్డిని సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Achchennaidu Comments: తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇసుక సత్యాగ్రహం'తో నాలుగేళ్లుగా జగన్ రెడ్డి చేస్తున్న ఇసుక దందా గుట్టు బట్టబయలైందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నేతలను జగన్ రెడ్డి అరెస్ట్‌లు, గృహనిర్భందాలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అరెస్టులతో టీడీపీ పోరాటాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. జగన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని వాడుకుని లక్ష కోట్లు దోచుకున్నాడని,.. ఆయన అధికారంలోకి వచ్చాక మద్యం, ఇసుక, భూములు అంటూ లక్షల కోట్లు దోచేశాడంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు టీడీపీ నేతలకు అనుమతించాలని కోరారు. అలా కాకుండా, అణచివేయాలని ప్రయత్నిస్తే ఉవ్వెత్తున ఎగసిపడి.. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.