NARA LOKESH: జగన్‌కు బ్రాండ్ వాల్యూ లేనందునే రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తన కేసుల కోసం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. బాబాయిని చంపింది అబ్బాయే అని గతంలో తిరుపతిలో ప్రమాణం చేశానని.. మరి జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీతానగరంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు. జగన్ పాలనలో ఏర్పడుతున్న ప్రతి ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
"జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి ఖర్మ పట్టుకుంది. ఆయన చేతకాని తనం వల్లనే, బ్రాండ్ వాల్యూ తక్కువుంది కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు లేని పరిస్థితి. కరోనా వైరస్‌తో అప్పుడు.. జగనోరా వైరస్‌తో ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు." - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
జగనోరా వైరస్‌తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. జగనోరా వైరస్‌కు వ్యాక్సిన్ వేయాలని లోకేశ్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ పాలన చూసి ప్రజలు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనుకుంటున్నారని అన్నారు. పరిపాలన అమరావతిలో ఉండాలని.. అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రం అన్ని ప్రాంతాలలో జరగలానే ఉద్దేశ్యంతోనే జిల్లాల్లో వివిధ పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. ఓ ఎమ్మెల్యే సోదరుడు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని.. బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని గుర్తించాలని లోకేశ్ అన్నారు. భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకొస్తే.. ముఖ్యమంత్రి చర్యల వల్ల అది మహారాష్ట్రకు తరలిపోయిందని ఆరోపించారు. విశాఖలోని కొండలను వైసీపీ నాయకులు దోచేశారని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: