TDP LEADERS: మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలపై.. జగన్ రెడ్డి బాదుడే బాదుడు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ, విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెట్టేం రఘురాం విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జగన్ పాలనలో నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్.. ఇలా అన్ని విషయాల్లోనూ బాదుడే బాదుడు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. డీజిల్ రేట్లు తగ్గినా.. మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్లీనరీ సమావేశాల అర్థాన్ని మార్చిన వైకాపా నాయకులు ప్లీనరీ సమావేశాల అర్థాన్ని మార్చారు : వైకాపా నాయకులు ప్లీనరీ సమావేశాల అర్థాన్ని మార్చేసి.. జగన్కు చిడతలు కొట్టేందుకు వాడుకోవడం సిగ్గుచేటని తెదేపా నాయకులు కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలోని తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి చర్చించకుండా చంద్రబాబు, తెదేపా నేతల్ని తిట్టేందుకే ప్లీనరీలు నిర్వహించారంటూ ఎద్దేవా చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన బందరు పోర్టు గురించి, ఇతర అభివృద్ధి పనులు, ఇళ్ల స్థలాలు, వివిధ వర్గాల సమస్యల గురించి ఏ మాత్రం పట్టించుకోని మంత్రి రోజా, జోగి రమేష్ ప్లీనరీలను అపహాస్యం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ఇవీ చదవండి: