TDP leaders met the state governor Abdul Nazir: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు రాష్ట్ర పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీఐబీ, పోలీసుల మధ్య దోబూచులాట సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద తాజాగా జరిగిన హైడ్రామాపై వెంటనే సమీక్ష జరపాలని విజ్ఞప్తి చేస్తూ.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీఐబీ, రాష్ట్ర పోలీసుల మధ్య దోబూచులాట సాగుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు.. వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, నాగుల్ మీరాలు ఈరోజు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద హైడ్రామాపై సమీక్షించాలని కోరారు. వారంతా ఓ బృందంగా విజయవాడలోని రాజ్ భవన్‌కు విచ్చేసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం టీడీపీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ముందుగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ..''సీబీఐ వారి పరిధి మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఎవరో పదిమంది ఆకు రౌడీలు వచ్చి అరెస్ట్ చేయకుండా వెళ్లిపోమ్మంటే వెనక్కి పోతరా..?, మరి వేలాది మంది టీచర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వారిని కంట్రోల్ చేశారు కదా..?, కమ్యూనిస్టులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు రోడ్ల మీదకి రాకుండ గృహ నిర్భంధాలు చేశారు కదా..?, వందలాది మంది కార్లలో ఊరేగింపుగా వస్తుంటే మీరంతా ఏం చేశారు..?, సీబీఐ అధికారులు ఎనిమిది గంటలపాటు ఎస్పీ వద్ద కూర్చోవడం ఏమిటి..?. జగన్ నాయకత్వంలో సీబీఐని రాష్ట్ర పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. సీబీఐ పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు ఇంత దయనీయంగా మారింది..?. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం.. సీబీఐ తీరును న్యాయస్థానం సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'' అని ఆయన వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని.. సీబీఐ వద్ద పక్కా ఆధారాలున్నప్పటికీ కూడా ఎందుకు అతన్ని అరెస్టు చేయకుండ జాప్యం చేస్తున్నారని సీబీఐ అధికారులను తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. వివేక హత్య కేసుకు సంబంధించి రూ. 100 కోట్లు ఖర్చు చేయడానికి ఆ నిధులు ఎక్కడి నుంచి అవినాష్ రెడ్డికి వచ్చాయన్నారు. తాడేపల్లి నుంచి అక్కడి ఆదేశాల మేరకు ఆడిస్తున్న నాటకంగా ఈ మొత్తం వ్యవహారం కనిపిస్తోందన్నారు. హత్య కేసులో ముద్దాయిని కాపాడేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సీబీఐ అధికారులు వస్తున్నారంటే రాష్ట్ర పోలీసులు భయపడతారని.. కానీ, ఈ రాష్ట్రంలో వైఎస్సార్సీపీని చూసి సీబీఐ అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు విచారణ ఎవరి వల్ల ఎందుకు ఇన్ని రకాల మలుపులు తిరుగుతున్నాయనేది గవర్నర్‌కు వివరించినట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఇవీ చదవండి