Chandrababu Pawan and Lokesh May Day greetings to workers: అంతర్జాతీయ కార్మిక (మేడే) దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు సామాజిక మాధ్యమాల వేదికగా శ్రామిక, కార్మిక, కర్షకులందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికుల కష్టం గురించి, రాబోయే రోజుల్లో పార్టీల తరుపున చేయబోయే పనుల గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో ఉంటుంది.. ముందుగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా.. "'శ్రామిక, కార్మిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. మీ కష్ట ఫలితమే సమాజ ప్రగతి. అందుకే శ్రమ జీవుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు చిత్తశుద్దితో ఉంటుంది తెలుగుదేశం పార్టీ. మీ కష్టానికి విలువ పెరిగే మంచి రోజులు రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కార్మికులకు అండగా ఉంటాం.'' అని ఆయన పేర్కొన్నారు.
ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు' అనే శీర్షికతో పలు కీలక విషయాలను తెలిపారు. ''శ్రమ శక్తిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చెమట చుక్కలు చిందించి శ్రామిక లోకం చేసే కష్టం.. ఆర్థిక పురోగతికి ఇంధనంలాంటిది. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యాన్ని కలిగిన కార్మిక లోకానికి నా తరఫున, జనసేన పార్టీ పక్షాన మే డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సంఘటిత రంగంలోని కార్మికులు తమ బాధలు వెల్లడించుకొనేందుకు వేదికలు ఉన్నా వారి సమస్యలు ఎన్నో అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికుల సమస్యలు అనేకం నా దృష్టికి వచ్చాయి. కష్ట జీవుల పక్షాన ఎల్లవేళలా జనసేన నిలబడుతుంది.'' అని ఆయన వెల్లడించారు.
కార్మికుల కష్ట ఫలితమే సమాజ ప్రగతి.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం శ్రామికులకు మేడే శుభాకాంక్షలను తెలిపారు. కార్మికుల కష్ట ఫలితమే సమాజ ప్రగతి అని ఆయన పేర్కొన్నారు. కార్మికులు చిందించే స్వేదమే ఈ ప్రపంచ సౌభాగ్యంమని లోకేశ్ అన్నారు. శ్రామిక శక్తే సమాజ ప్రగతికి చోదక శక్తి అంటూ యావత్తు కార్మిక లోకానికి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట్విట్ చేశారు.
ఘనంగా మేడే-సుందరయ్య జయంతి.. మరోవైపు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో సీపీఎం నాయకులు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకతోపాటు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి వేడుకలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య ఆశయాలను నెరవేరుస్తామని సీపీఎం నాయకులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని.. వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని కర్నూలు జిల్లా సీపీఎం కార్యదర్శి గౌస్ దేశాయ్ హచ్చరించారు.
ఇవీ చదవండి