CJI Chandrachud Visit Vijayawada: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో హైకోర్టు సీజే, సీఎస్, డీజీపీ సీజేఐకి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి విజయవాడ నోవాటెల్ హోటల్‌కు వెళ్లిన సీజేఐని.. సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి జస్టిస్ చంద్రచూడ్.. దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత హైకోర్టు సీజే ఇచ్చే విందులో సీజేఐ పాల్గొననున్నారు. శుక్రవారం మంగళగిరిలో జ్యుడీషియల్ అకాడమీ భవనాన్ని ప్రారంభించనున్న సీజేఐ ఆ తర్వాత నాగార్జున వర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
అంతకుముందు తిరుమల శ్రీవారిని జస్టిస్ చంద్రచూడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ ఉదయం తిరుమల చేరుకున్న ఆయనకు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ మహాద్వారం వద్ద సీజేఐ దంపతులకు ఇస్తికఫాల్ మర్యాదలు చేశారు. అనంతరం సీజేఐ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.