Summer Effect in RTC: రోజు రోజుకూ పెరుగుతున్న ఎండలు ఆర్టీసీ ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఎండలు పెరగడం సహా వేడిగాలులు వీస్తుండటంతో వాటి ధాటికి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది అల్లాడుతున్నారు. భానుడి భగభగలకు బస్సుల్లో వేడి విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే జంకుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 11 వేల ఆర్టీసీ బస్సులు పలు రూట్లలో తిరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 33 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. 50 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు వీరిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంటారు. భానుడు భగభగల ధాటి ఆర్టీసీపై పెను ప్రభావం చూపుతోంది. ఉదయం 10 గంటలు కాగానే సెగలు ప్రారంభమవుతున్నాయి.
బస్సులు వేడెక్కుతున్నాయి. బస్టాండ్లలోనూ వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే జంకుతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణం చేసేవారు బయటి నుంచి వేడి గాలులు వీస్తుండటం, లోపల ఉక్కపోతగా ఉండటం వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొందరు వడదెబ్బకు గురై అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే కొందరు ప్రయాణాలు చేస్తున్నారు.
దీంతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా తగ్గింది. విజయవాడ నుంచి పలు దూర ప్రాంతాలకు వెళ్లే వేలాది బస్సులు.. ప్రయాణికులు లేక బోసిపోతున్నాయి. విజయవాడ నగరంలో తిరిగే వందలాది నాన్ ఏసీ సిటీ బస్సులన్నీ దాదాపు ఖాళీ సీట్లతో తిరుగుతున్నాయి. బస్సులో తిరిగే సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మండే ఎండల్లో బస్సు నడిపేందుకు డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు.
బయట సూర్యుడి వడగాలిని.. బస్సులోని ఇంజిన్ వేడిని తట్టుకుని ఉద్యోగం చేయాలంటే కత్తి మీద సాములా ఉందంటూ సిబ్బంది వాపోతున్నారు. తలకు రుమాలు కట్టుకోవడం, ముఖానికి మాస్కులు ధరించటం వంటి వాటి వల్ల వేడిగాలుల బారిన పడకుండా చూసుకుంటూ తిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎండల ధాటికి బస్సు ఇంజిన్ నుంచి ఉన్నట్లుండీ మంటలు వస్తున్నాయి.
వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు తమతో పాటు ఓ ఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఇంకా ఎండలు పెరిగితే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు బస్టాండ్లలో మజ్జిగ పంపిణీ చేసేవారు. తాగేందుకు చల్లని తాగునీరు అందుబాటులో ఉంచేవారు. ప్రయాణికుల నీడ కోసం చలువ పందిర్లు వేసేవారు.
ప్రస్తుతం విజయవాడ సహా మరి కొన్ని ప్రధాన బస్టాండ్లలో కూలర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఎండల దృష్ట్యా బస్సుల్లోనూ చల్లని తాగునీరు అందేలా క్యాన్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. వేడి గాలుల నుంచి రక్షణ కోసం బస్సుల కిటికీలకు చల్లదనం వచ్చేలా మ్యాట్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం బస్సుల్లో ఈ తరహా సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల్లో సీట్ల ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా తగ్గుతోంది. గతంలో 66 శాతం పైగా ఓ ఆర్ నమోదయ్యేవి. అయితే ప్రస్తుతం 60 కన్నా తక్కువే నమోదవుతోంది. కొన్ని బస్సులను ఖాళీగా తిప్పాల్సివస్తోందని అధికారులు అంటున్నారు. పలు రూట్లలో బస్సులు ట్రిప్పు వెళ్లొచ్చినా కనీసం డీజిల్ ఛార్జీలు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీలో నష్టాలను తగ్గించేందుకు రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో బస్సులను నిలిపివేస్తున్నారు.
"ఈ ఎండల్లో డ్యూటీ చెయ్యటం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. భానుడి వేడికి ఇటీవల మా ఆర్టీసీ సిబ్బందిలో కొంతమంది కళ్లు తిరిగి పడిపోయారు. బస్సులో ఉన్న రాడ్డులు, సీట్లు కూడా ఎండకు వేడిగా మారిపోతున్నాయి. ఒకవైపు ఇంజన్ వేడి.. మరోవైపు సూర్యుడి అధిక వేడిని తట్టుకుని ఉద్యోగం చెయ్యటం చాలా కష్టంగా ఉంది." - ఆర్టీసీ సిబ్బంది
"ఇటీవల ఎండలు కొంచెం ఎక్కవయ్యాయి. గతంలో చలువ పందిళ్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు కాస్త ఊరట కలిగించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించటం లేదు." - ప్రయాణికులు
ఇవీ చదవండి: