Governor Biswabhushan Harichandan: ఛత్తీస్గడ్ గవర్నర్‌గా బదిలీ అయిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయంగా వీడ్కోలు పలికింది. విజయవాడలోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిధిగా సీఎం వైఎస్ జగన్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను సీఎం జగన్ ఘనంగా సన్మానించి మొమెంటో అందించారు.
గవర్నర్ వ్యవస్ధకు నిండుతనం తీసుకువచ్చారు: రాష్ట్ర ప్రజల తరపున, ప్రభుత్వం తరపున, సీఎం జగన్ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. బిశ్వభూషణ్ హరిచందన్ ఆత్మీయుడైన పెద్దమనిషిగా, గవర్నర్ వ్యవస్ధకు ఒక నిండుతనం తీసుకువచ్చారని సీఎం ప్రసంశించారు. మూడు ఏళ్ల కాలంలో రాజ్యాంగ వ్యవస్ధల మధ్య ఉండాల్సిన సమన్వయం ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారన్నారు. గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్య కాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నామని, కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా, తండ్రిలా, పెద్దలా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడి ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ మన గవర్నర్ వాత్సల్యం చూపించారని సీఎం అన్నారు. ఉన్నత విద్యావేత్త, న్యాయనిపుణులు, స్వాతంత్య్ర సమరయోధులైన గవర్నర్ ఒడిశా ప్రభుత్వంలో నాలుగుసార్లు మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని సీఎం అన్నారు. బిశ్వభూషణ్ హరిచందన్ గారికి ప్రతిచోటా కూడా వెన్నుదన్నుగా నిల్చిన ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ ఆయన విజయానికి కారణమయ్యారన్నారు.. గవర్నర్ కుటుంబానికి రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరపున, తన కుటుంబం తరపున సీఎం ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజలు చూపిన ప్రేమ,అభిమానం మరువలేను: రాష్ట్రంలో మూడేళ్లపైగా నిర్వహించిన గవర్నర్ పదవి తనకు సంతృప్తి మిగిల్చిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సీఎం జగన్ సహా ప్రజలు చూపిన ప్రేమ, అభిమానం, వాత్సల్యం మరువలేమన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలను మరువలేనన్నారు. ఏపీ తనకు రెండో ఇళ్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ,ప్రజల సంక్షేమానికి గవర్నర్ సీఎం మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. సీఎం జగన్ చూపిన గౌవరం, ఆప్యాయత మరువలేనిదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని అన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. జ్యుడీషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వ్యవస్థలు పరస్పరం గౌరవిస్తూ, సమభావంతో పని చేయాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌గా ఏపీకి అందించిన సేవలను సీఎస్ జవహర్ రెడ్డి కొనియాడారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. దుర్గామల్లేశ్వర దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ అధికారులు, వేదపండితులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్, అధికారులు అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన గవర్నర్ వేద పండితులు, ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ రేపు విజయవాడ రానున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బుద్దా రాంబాబు, కేసరి నాగమణి, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కెవీఎస్ కోటేశ్వరరావు, ఎల్ రమాదేవి, సహాయ కార్యనిర్వాహణాధికారి ఎన్ రమేష్, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: