Sri Lakshmi Maha Yagnam Bills Pending: రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేపట్టినా తీసుకోవడమే కానీ ఇచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలు పనులలో గుత్తేదారులకు బిల్లులు చెల్లంచకుండా పెండింగ్లో (Bills Pending for Contractors in AP) పెట్టిన ప్రభుత్వం.. తాజాగా మరొకటి పెండింగ్ పెట్టింది. ప్రభుత్వం ఎంతో ఘనంగా నాలుగు నెలల కిందట చేసిన శ్రీ లక్ష్మి మహాయజ్ఞం చేసేందుకు గుత్తేదారులకు ఇవ్వాల్సిన బిల్లులను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.
నిధుల కొరత అంటూ తిప్పుతున్నారు: నాలుగు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన శ్రీ లక్ష్మి మహాయజ్ఞానికి అవసరమైన అరటి చెట్లు, మామిడి తోరణాలను ఓ గుత్తేదారు సరఫరా చేశారు. ఆయనకు ఇవ్వాల్సిన 3 లక్షలు రూపాయలు ఇవ్వకుండా.. నిధుల కొరత ఉందంటూ తిప్పుతున్నారు. నెలల తరబడి తిరుగుతున్నా ఇవ్వకపోవడంతో.. దుర్గగుడి ఈవో కార్యాలయానికి ఆదివారం వచ్చి వాగ్వాదానికి దిగారు.
No Development Works: పన్నులపై ఉన్న శ్రద్ధ.. పనులపై ఉండదా! గుత్తేదారులు బెదిరిపోవడానికి ఎవరు కారణం?
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మే 12 నుంచి 17 వరకూ అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని (Sri Lakshmi Maha Yagnam) ఆరు రోజులు నిర్వహించారు. యజ్ఞం ప్రాంగణం అలంకరణ దగ్గర నుంచి పూజలకు అవసరమైన సరకులు సహా అన్నింటినీ పలువురు గుత్తేదారులకు అప్పగించారు.
45 లక్షలకు పైగా గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది: యజ్ఞం పూర్తయిన తర్వాత బిల్లులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కూరగాయలు, పూలు, తోరణాలు, అరటి, మామిడి కొమ్మలతో అలంకరణ, గ్యాస్, సరకులు, సెక్యూరిటీ.. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా చేసి గుత్తేదారులకు అప్పగించారు. వీటికి మొత్తం 45 లక్షలకు పైగా గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. కానీ.. గత నాలుగు నెలలుగా వారికి బిల్లులు చెల్లించకుండా తిప్పుతున్నారు.
Contractors Bills: రాష్ట్రంలో బిల్లుల గోస..! దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్లు..
నెల రోజులుగా దుర్గగుడి చుట్టూ తిరుగుతున్న గుత్తేదారులు: దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి తొలుత చెల్లిస్తారంటూ మూడు నెలలు తిప్పారు. చివరికి నిధుల కొరత ఉందంటూ ఈ బిల్లులను దుర్గగుడి నుంచి చెల్లించాలంటూ ఆగస్టు 25న దుర్గగుడి ఈవోకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెల రోజులుగా దుర్గగుడి చుట్టూ గుత్తేదారులు తిరుగుతున్నారు.
డబ్బులు లేనప్పుడు.. మహాయజ్ఞాలెందుకు చేయడమెందుకు.. గుత్తేదారులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించాలంటూ దేవాదాయశాఖ అధికారులను నిలదీస్తున్నారు. సరకుల సరఫరా చేసిన గుత్తేదారుకు రూ.25లక్షలు, పూల అలంకరణకు రూ.12లక్షలు, అరటిచెట్లు, మామిడి తోరణాలకు రూ.3లక్షలు, పాలు, పెరుగుకు రూ.2లక్షలు, కూరగాయలకు రూ.2లక్షల చొప్పున బిల్లులు బకాయి పెట్టారు. ప్రస్తుతం వారు దుర్గగుడి ఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.