Sri Lakshmi Maha Yagnam at Indira Gandhi Stadium : విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞం జరగనుంది. రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు ఐదు కోట్ల రూపాయలకు మించే ఈ యజ్ఞం కోసం ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉదయం ఈ మహా యజ్ఞానికి హాజరయ్యారు. ఓ గంట సేపు ఇక్కడ ఉండి ఆ తర్వాత నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వెళ్లనున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ పేరిట నిర్వహిస్తోన్న ఈ యజ్ఞానికి వివిధ ప్రాంతాల వేదపండితులు, రుత్వికులు, ఘనాపాటిలను ఆహ్వానించారు. దేవదాయ ధర్మదాయశాఖ ద్వారా 108 కుండాలతో చతురాగమ యుక్తంగా చేస్తోన్న తొలి యజ్ఞంగా రాష్ట్ర దేవాదాయశాఖ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం అనే నాలుగు వేదాలతో.. యజ్ఞాలు, హోమాలు, వీరశైవం, తంత్రసారం, గ్రామ దేవతారాధన, చాత్తాద శ్రీవైష్ణవం అనే నాలుగు ఆగమముల ప్రకారముగా జప పారాయణలు జరుగుతమని ఆయన అన్నారు.
మహాలక్ష్మీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, సప్తనదులు, త్రి సముద్ర జలాలు, 1008 కలశాలతో విశేష అభిషేకాలు చేస్తారని కొట్టు సత్యనారాయణ అన్నారు. సిద్దేశ్వరీ పీఠం, తిరుపతి శక్తి పీఠం, శ్రీశైలం సూర్య సింహాసన పీఠం, మంత్రాలయం రాఘవేంద్ర మఠం, పుష్పగిరి మహా సంస్థాన పీఠం, తిరుమల, తిరుపతి దేవస్థానం, మైసూరు దత్త పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేస్తారన్నారు. ప్రతి రోజూ సాయంత్రం ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రి ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
12వ తేదీన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం, 13న ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణం, 14న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ వారి కళ్యాణం, 15న శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి కళ్యాణం, 16న సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈనెల 17న మహా పూర్ణాహుతి కార్యక్రమంతో యజ్ఞం ముగుస్తుందని కొట్టు సత్యనారాయణ తెలిపారు.
"ఈ రాష్ట్రం అన్ని రకాలుుగా ముందంజలో ఉండాలని ఉదేశ్యంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. 64 వేద పండితులు 4 వేదాలు పారాయనం చేస్తారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు వచ్చి వీక్షించాలని ఆహ్వానిస్తున్నాను."- కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి
ఇవీ చదవండి