Shadi Khana Construction Works Delay: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తాము అధిక ప్రాధాన్యమిస్తున్నామని, అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం జగన్ గొప్పలు చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. గుడివాడలో తెలుగుదేశం హయాంలో నిర్మాణం చేపట్టిన షాదీఖానా నేటికీ పిల్లర్ల దశలోనే ఉండటమే దానికి నిదర్శనం. బూతులతో విపక్షాల మీద విరుచుకుపడే ఎమ్మెల్యే కొడాలి నానికి నియోజకవర్గ అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్ర సమయంలో ముస్లిం మైనార్టీలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ముస్లింల శుభకార్యాలు, యువతకు నైపుణ్య శిక్షణకు ఉపయోగపడే ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాలను గాలికొదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా 600 వరకు ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాలుండగా అందులో 30 శాతం వరకు సరైన నిర్వహణలేక దీనావస్థలో ఉన్నాయి.
'షాదీఖానాకు పూర్వ వైభవం కల్పించండి'
Shadi Khana Construction in Gudivada: పేద ముస్లింలకు ఉపయోగపడే పథకాల్లో ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాల ఏర్పాటు ఒకటి. వివాహాల నిర్వహణకు తక్కువ అద్దెతో వీటిని కేటాయించడంతోపాటు ముస్లిం యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకూ వీటిని వినియోగించేలా రూపొందించారు. ముస్లింలే కాకుండా ఇతర వర్గాలవారికి వివాహాల సమయంలో అద్దెకు ఇచ్చి వచ్చిన నిధులతో ప్రభుత్వమే నిర్వహణ, పర్యవేక్షణ పనులు చూస్తుంది. 1997లోనే టీడీపీ ప్రభుత్వం మండలానికి ఒక షాదీఖానా ఏర్పాటుకు నిర్ణయించింది.
అసంపూర్తిగా ఒంగోలు షాదీఖానా భవనం
తెలుగుదేశం హయాంలో చేపట్టిన కొన్ని షాదీఖానాల నిర్మాణాన్ని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్ నాలుగున్నరేళ్లుగా మూలన పెట్టింది. సరైన నిర్వహణలేక చాలాచోట్ల షాదీఖానాలు పాడుబడే స్థితికి చేరుతున్నాయి. కృష్ణాజిల్లా గుడివాడలో గత ప్రభుత్వం 96 లక్షల రూపాయలతో షాదీఖానా నిర్మాణానికి తలపెట్టి నాలుగున్నరేళ్లయినా పిల్లర్ల దశ దాటలేదు. శిథిలావస్థకు చేరిన షాదీఖానాను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చేశారు. 20 లక్షల రూపాయలతో కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టి పిల్లర్ల దశ వరకు నిర్మించారు.
Shadi Khana Construction: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని పట్టించుకోకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. దీంతో పవిత్రంగా ఉండాల్సిన ప్రదేశం భయానకంగా తయారైంది. షాదీఖానా నిర్మాణాన్ని గాలికొదిలేయడంతో ఆ ప్రాంతమంతా అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది. దీంతో చీకటి పడితే షాదీఖానా రోడ్డు వైపు రావాలంటే భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని చెబుతున్న కొడాలి నాని షాదీఖానాను ఎందుకు పట్టించుకోవట్లేదో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
MLA protest: హజ్‌హౌస్ నిర్మాణంలో జాప్యం.. సీఎం సమాధానం చెప్పాలంటూ.. మాజీ ఎమ్మెల్యే నిరసన