Server problem in registration department: విజయవాడలో.. గత రెండు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రయవిక్రయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం నుంచి సర్వర్ ఓపెన్ కావడంతో క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో సబ్ రిజిష్ట్రార్ కార్యలయాలకు చేరుకుంటున్నారు. విజయవాడ పట్టణంలో ఎక్కువగా అపార్టెమెంట్లు, ప్లాట్లు క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో సర్వర్ నిలిచిపోవడంతో రెండు రోజులు నుంచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి గాంధీనగర్, పడమట, గుణదల సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
విశాఖ.. రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చే రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్ సమస్యతో రెండు రోజులుగా ఏ రిజిస్ట్రేషన్ జరగడం లేదు. విశాఖలో ప్రధాన లావాదేవీలు జరిపే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వద్ద వినియోగదారులు గంటలు తరబడి వేచి చూస్తున్నారు. అసలే నెలాఖరు, అటుపై రేపోమాపో మళ్లీ ధరలు, మార్కెట్ విలువలు పెంచుతారనే అపోహల మధ్య ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్య రావడం వల్ల రిజిస్ట్రేషన్ కాగితాలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో సాంకేతిక సమస్య వచ్చిందని చెప్తున్నారు.. నిపుణులు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా.. నందిగామ, కంచికచర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయాలు క్రయవిక్రయదారులతో కిటకిటలాడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం భూములు విలువ 30% పైన పెంచుతుండటంతో ఒకసారిగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు క్రయ, విక్రయదారులు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పోటెత్తారు. ఈ మేరకు నందిగామ కంచికచర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం నుంచి కొనుగోలుదారులు అమ్మకం దారులతో బిజీగా మారింది. గత రెండు రోజుల నుంచి సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ల సర్వర్ బిజీగా ఉండి రిజిస్ట్రేషన్ పెద్దగా జరగలేదు. దీంతో మే నెల చివరి రోజు కావడంతో ఎక్కువ మంది కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మూడుసార్లు భూములు విలువ పెంచిందని, మరోసారి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ రకంగా భూములు విలువ పెంచిందని ఆరోపించారు.
భూముల ధరలు పెంచేందుకు కసరత్తు.. రేపట్నుంచి ఏపీలో కొన్ని చోట్ల భూముల ధరలు పెంచేందుకు స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికన భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొన్ని చోట్లే భూముల ధరలను పెంచాలనే సూచనలు రావడంతో అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టారు. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువ జరుగుతాయో.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపిక చేసిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10-15 శాతం మేర భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.