Sankranti Bommala Koluvu in Vijayawada: సంక్రాంతి అంటేనే సంతోషాల సంబరం. ఈ సమయంలో బొమ్మల కొలువు ఏర్పాటుకూ ప్రత్యేక స్థానం ఉంది. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మలను అద్భుతంగా అమర్చి, ఇతిహాస విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే సంకల్పం ఈ కొలువుల వెనకున్న ఆంతర్యం. ఈ బొమ్మల కొలువు పెట్టడం కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా, సంస్కృతీ సంపన్నమై సంప్రదాయ పరిరక్షణతో పాటు కళాత్మక దృష్టినీ పెంపొదిస్తుంది.
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంతోపాటు ఇతర ఆలయాలు, ఇళ్లల్లోనూ బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దసరా తొమ్మిది రోజులపాటు కొన్నిచోట్ల, సంక్రాంతి మూడు రోజులు మరికొన్ని చోట్ల కొలువులు పెడతారు. ఇంటి ఆచారం, ఆనవాయితీ ఆధారంగా ఆడపిల్లలతో మెట్లుమెట్లుగా బొమ్మలను అమరుస్తారు. ఇవి ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి.
ఇంట్లో వారందరూ కలసికట్టుగా బొమ్మలు అమర్చడం వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. దేవుళ్ల బొమ్మలు, కొండపల్లి, నక్కపల్లి బొమ్మలతోపాటు దేశవిదేశాల బొమ్మలూ సేకరించి కొలువులో ఉంచుతున్నారు. వీటితో పాటు పంచాంగం బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, పచారీకొట్టు వ్యాపారి, ఆవూదూడ, జంతువులు, పక్షలు, పండ్లు, ప్రకృతి తదితర బొమ్మలూ కొలువుల్లో ఉంటాయి. కాలక్రమంలో దేశ నాయకులు, పురాతన కట్టడాలు, ప్రయాణసాధనాలు, వాహనాల బొమ్మలకూ వీటిలో చోటుకల్పిస్తున్నారు. అందంగా కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధుమిత్రులను పిలుస్తుంటారు.
వాటి చెంతన కోలాటం ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. మెట్లపై బొమ్మలను తామస, రాజస, సత్వగుణాలకు ప్రతీకగా అమరుస్తారు. ఈ మూడు గుణాలను అధిగమిస్తే దేవి కరుణ లభిస్తుందని నమ్మకం. భక్తి, త్యాగం, స్నేహం, సమానత్వం, శ్రద్ధ పెంచడమే ఈ పండుగల అంతరార్ధం. రానురానూ బొమ్మల కొలువు లాంటి సంప్రదాయాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నా ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా అందరినీ ఆకర్షిస్తోంది.
DURGA TEMPLE: సంక్రాంతి సందర్భంగా దుర్గగుడిలో బొమ్మల కొలువు..ప్రారంభించిన ఛైర్మన్, ఈవో
"సకల దేవతల స్వరూపం ఈ బొమ్మల కొలువు. బాలికలే ప్రత్యేకంగా చేయడానికి కారణం ఉంది. అది ఏంటంటే గోదాదేవి పూజ చేసి, గొబ్బిళ్లు తొక్కి, పాటలు పాడుతారు. అలా చేస్తే ఆ స్వర శబ్దాలకు వారికి ఆ గోదాదేవి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా పిల్లలకు సకాలంలో పెళ్లి అయ్యే యోగ్యం కలుగుతుంది". - శిపప్రసాదశర్మ, దుర్గగుడి స్థానాచార్యులు
"ఇది వరకటి కాలంలో ఇవన్నీ ఇంట్లో చేసుకునే వాళ్లం. కొత్త పంటల గురించి, దేవతల బొమ్మలు, రైతులవి, అమ్మవారిని పెట్టేవారు. ఒక థీమ్ క్రియేట్ చేసి పెట్టడం వలన, మన క్రియేటివిటీ కూడా బయటపడుతుంది. ఇప్పుడు ఏమో బయట షాపులలో కొనితెచ్చి పెడుతున్నారు". - బాలిక తల్లి