Rushi konda Beach In Visakhapatnam : డిసెంబరు రెండో వారంలో సీఎం జగన్ విశాఖకు వస్తారనే చర్చ సాగుతోంది. రుషికొండ మీద భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ప్రఖ్యాతిగాంచిన, బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలిగిన రుషికొండ బీచ్‌ను మూసేస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు అనుకూలమైన బీచ్‌లకు స్వీడన్ ఈ రేటింగ్ ఇస్తుంది. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉంటే విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. కేంద్రం గతంలో ఇక్కడ 7 కోట్లతో వసతులు కల్పించింది. మరో 3 కోట్లతో వాటిని మరింత మెరుగుపరిచారు. సీఎం వ్యక్తిగత భద్రత చూసే అధికారులు రెండు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు ఉండకూడదని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. బీచ్‌లోని పిల్లల ఉద్యానవనం, మరుగుదొడ్లు, మంచినీటి శుద్ధి కేంద్రాన్ని మరో ప్రాంతానికి తరలిస్తారని సమాచారం.
పర్యాటకానికి ఏపీ చిరునామా కావాలన్న జగన్ - అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వరే!
RK Beach Closing For CM Jagan Secutity : రుషికొండ కేంద్రంగా జల క్రీడల విన్యాసాలను ప్రోత్సహించేలా గతంలో ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని తొలగించడంతో క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం విశాఖ విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేందుకు బీచ్‌లోని హెలిప్యాడ్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్ దిగడానికి అడ్డంగా ఉన్నాయని జల క్రీడల విన్యాసాల పడవలను భద్రపరిచిన షెడ్లు కూల్చేశారు. మొత్తం పరిసరాలను భారీ యంత్రాలతో చదును చేస్తున్నారు. పర్యాటకుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల పైకప్పులను గురువారం తొలగించారు. ఒకట్రెండు రోజుల తర్వాత వాటినీ పూర్తిగా తీసేస్తారంటున్నారు. హెలిప్యాడ్ నుంచి గతంలో కొండ పక్కన నిర్మించిన కొత్త రోడ్డులోకి వెళ్లేందుకు అనుసంధాన మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ- భీమిలి మార్గం నుంచి బీచ్‌లోకి వెళ్లే రోడ్డును కొత్తగా పునరుద్ధరించారు. బీచ్‌లోని శివాలయాన్ని ఆనుకొని ఉన్న మరో రోడ్డుకు కొత్త హంగులు అద్దారు. కొండ మీదికి 24 గంటల నీటి సరఫరా నిమిత్తం కొండ వెనుక పంపుహౌస్ నిర్మిస్తున్నారు.
విశాఖ రుషికొండ బీచ్ కఠిన నిబంధనలను చవిచూడక తప్పదా?
AP Government Closing RK Beach : పేదలు, పెత్తందారులు అని మాట్లాడే జగన్ రుషికొండలో క్యాంపు కార్యాలయం భద్రత పేరుతో పేదల ఉపాధికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సుమారు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు రుషికొండ బీచ్ నుంచే నిత్యం వేట సాగిస్తుంటారు. అక్కడే వలలు అల్లుకుంటారు. పడవలకు మరమ్మతులు చేస్తుంటారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను అభివృద్ధి చేసిన సమయంలోనూ వారికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ప్రస్తుతం వారి వేట స్థావరం మార్చుకోవాలని, రుషికొండ సమీపం నుంచి వేటకు వెళ్లకూడదనే హెచ్చరికలు చేసినట్లు సమాచారం. స్థానిక దుకాణదారుల వ్యాపారాల పైనా పలు ఆంక్షలు విధించినట్లు సమాచారం.
కొనసాగుతున్న విధ్వంసం.. రుషికొండపై యథేచ్ఛగా నిర్మాణాలు