Round Table Meeting on Reallocation of Krishna Waters: కృష్ణా జలాల పునః పంపిణీపై కేంద్రప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీకి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని విజయవాడలో నిర్వహించిన రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు విపక్ష సభ్యులు, రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులను రాష్ట్రప్రభుత్వం ఢిల్లీ తీసుకువెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశంలో కోరారు. ఈ సమస్యపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడలో 30 గంటలపాటు నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు. విజయవాడ దాసరి భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
KRISHNA WATER DISPUTE 'కృష్ణా జలాల పంపిణీ వివాదం.. జగన్ స్వార్థ ప్రయోజనాలకు రైతులు బలికావాలా..?'
సీఎం, మంత్రులు ఎందుకు స్పందించడం లేదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు, జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్షం రాజ్యమేలుతుందని..18 జిల్లాల్లో 24 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కరవుపై సీఎం, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ, రాజకీయ, ప్రజాసంఘాల నేతలు ప్రశ్నించారు.
జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం: కృష్ణా జలాల పునః పంపిణీపై తీసుకువచ్చిన గెజిట్ వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని జై జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం నాయకులు అన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీపై తీసుకువచ్చిన గెజిట్ను వ్యతిరేకిస్తూ... కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణంకు కృష్ణా జలాల పంపిణీ పై తీసుకువచ్చిన గెజిట్ను వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి వినతిపత్రం అందజేయాల్సిందిగా కోరారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విశాఖలో ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విశాఖ ప్రాంతానికి కృష్ణా నదితో ఎటువంటి సంబంధం లేని ప్రాంతమన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, పంటలకు నీరంబక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు తెలిపారు. తద్వారా కృష్ణాజిల్లాల పంపిణీలో ఆంధ్ర ప్రాంతానికి... నీటి ఇబ్బందులు నెలకొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.