Road Crossing Problems in Vijayawada: విజయవాడలో పెరిగిన వాహన రద్దీతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మహానాడు కూడలి, రామవరప్పాడు రింగ్, రామవరప్పాడు ఆలయం కూడలి, పేరంటాలమ్మ ఆలయం, ఫోర్డ్ షోరూం, ఎస్ఈఆర్ సెంటర్, శక్తి కల్యాణ మండపం, ఎస్ఆర్కే కళాశాల, బెస్ట్ ప్రైస్, నిడమనూరు వంతెన, వాల్వో షోరూం, గూడవల్లి... ప్రమాదకర కూడళ్లుగా మారాయి.
అత్యధిక ప్రమాదాలు మహానాడు కూడలి, రామవరప్పాడు రింగ్ నుంచి గూడవల్లి వరకు జరుగుతున్నాయి. జాతీయ రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. సమీప గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వేలాదిమంది ద్విచక్రవాహనాలపై విజయవాడ వచ్చి వెళ్తారు. జాతీయ రహదారిపై కొన్నిచోట్ల రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేక పాదచారులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలకు గురవతున్నారు.
Traffic Problems: రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ.. ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడో..!
డివైడర్ దాటకుండా ఇనుప గ్రిల్ ఏర్పాటు చేస్తే కొంత మేరకు ఫలితం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రోడ్డుదాటే చోట బ్లింకర్లు, జీబ్రా లైన్లు (Zebra crossing) ఏర్పాటు చేస్తే ప్రమాదాలను కొంతవరకు అరికట్టవచ్చు. రోడ్డు దాటుతూ గత ఏడాది 17 మంది మృత్యువాత పడగా.. ఈ ఏడాది ఇప్పటివరకు రోడ్డు దాటుతూ 12 మంది చనిపోయారు. రాత్రిళ్లు విద్యుత్తు దీపాలు వెలగక కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గన్నవరం నుంచి వచ్చే భారీ వాహనాలు రామవరప్పాడు రింగ్ వద్ద గుణదల రోడ్డులోకి తిరిగే సమయంలో.. ఇక్కడ రహదారి పల్లంగా ఉన్నందున చోదకులు ఇబ్బంది పడటమే కాకుండా చిన్న వాహనాలు కనిపించడం లేదని గతంలో అధికారులు గుర్తించారు. రామవరప్పాడు పైవంతెన వైపు వెళ్లే మార్గంలో పార్కు వద్ద యూటర్న్ తీసుకోవడం కష్టమని గుర్తించారు. రామవరప్పాడు సర్వీసు రోడ్డు నుంచి మహానాడు కూడలికి వాహనాలు వేగంగా రావడంతోపాటు జాతీయ రహదారిపై వచ్చే వాహనదార్లకు కన్పించడం లేదని అధ్యయనంలో తేలింది.
ఈ ఏడాది మే నెలలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, జాతీయ రహదారి అథారిటీ అధికారులతో కలిసి జాతీయ రహదారిపై ప్రమాదాలు తరచూ జరిగే ప్రమాదాలను పరిశీలించారు. చూసి వెళ్లారే తప్ప నాలుగు నెలలైనా ఇంతవరకు సరైన చర్యలు చేపట్టలేదన్న విమర్శలున్నాయి. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, జాతీయ రహదార్ల అథారిటీ అధికారులు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జాతీయ రహదారిపై వాహనాలు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ద్విచక్ర వాహనదార్లు, పాదచార్లు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు సమగ్రమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.