Public Facing Problems Over Shortage Of RTC Buses : ఆర్టీసీ బస్సు తుస్సుమంటోంది. సురక్షిత ప్రయాణానికి చిరునామాగా పేరొందిన ఆర్టీసీ, వైఎస్సార్సీపీ పాలనలో ప్రమాదాలకు నెలవుగా మారింది. కాలం చెల్లిన డొక్కు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తుక్కు చేయాల్సిన బస్సులను ఇప్పటికీ రోడ్లపై పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్డెక్కించకూడదన్న కేంద్రం నిర్దేశంతో 214 బస్సుల్ని పక్కనపెట్టేశారు.
ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?
Shortage of APSRTC Buses : మిగిలిన వాటిలో 1,626 బస్సులు 15 లక్షల కిలోమీటర్లకు పైగా తిరగ్గా, 2, 819 బస్సులు 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగి అలసిపోయాయి. ఇలాంటి వాటిని కాలం చెల్లినవిగా పరిగణించి, తుక్కుగా మార్చాలన్నది ఆర్టీసీ నిబంధన. ఈ లెక్కన 8,256 ఆర్టీసీ బస్సుల్లో 12 లక్షల కిలోమీటర్లు, ఆపైన తిరిగినవి 4,445 ఉన్నాయి. అంటే 53.83 శాతం కాలం చెల్లిన డొక్కు బస్సులే. ఇలాంటి బస్సుల్లో ప్రయాణం ప్రజలకు దినదిన గండంగా మారింది. వాటిలో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లు కూడా డ్యూటీ పూర్తయ్యాకే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొంది.
పేరుకే ప్రభుత్వంలో విలీనం - ఉద్యోగుల ప్రయోజనాలను హరించిన వైసీపీ ప్రభుత్వం
APSRTC Income and Losses : రాష్ట్రంలో రోడ్లు ఎంత సుందరంగా ఉన్నాయో తెలియంది కాదు. గుంతలు, గోతులతో నిండిన రోడ్లపై తిరిగే కాలం చెల్లిన బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో, అదుపుతప్పి పంటకాల్వలు, వాగులు, వంకల్లోకి దూసుకెళ్లి ప్రాణాలు తీస్తాయో తెలియడం లేదు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600 బస్సుల్ని వెంటనే మార్చాలని 2019 నవంబర్ 4 నాటి సమీక్షలో సీఎం జగన్ ఉద్బోధించారు. ఆ లెక్కన 4,445 బస్సుల్ని ఇప్పటికిప్పుడు పక్కనబెట్టాలి. అప్పుడే ప్రజాభద్రతకు భరోసా ఉంటుంది. కానీ కొత్త బస్సులు కొనకుండా ఉన్నవాటిని మూలనపడేస్తే ప్రజారవాణా సంగతేంటన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రయాణికుల రద్దీకి అవరమైనన్ని బస్సులు లేకపోవడంతో సీఎం సొంత జిల్లా కడపలో ఇటీవలే 25 సర్వీసులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే దుస్థితి నెలకొంది.
"సొంతం, అద్దె బస్సులు కలిపి 2019 నాటికి ఆర్టీసీలో 12,027 బస్సులు ఉండేవి. అందులో 1,204 బస్సులు తగ్గి ఆ సంఖ్య ఇప్పుడు 10,823కి దిగజారింది. BS-4 బస్సుల గడువు ముగియడంతో 2020 మార్చిలో 300 బస్సులు కొనుగోలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫేమ్-2 పథకం కింద తిరుమల కొండపైకి, తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు నడిపేలా 100 విద్యుత్ బస్సులు అద్దెకు తీసుకున్నారు. ఇవి మినహా నాలుగున్నరేళ్లలో కొత్తగా బస్సులు కొన్న దాఖలాలులేవు. ప్రజారవాణా పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఈ విధంగా ఉంది." - చెవుల కృష్ణాంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్
కొత్త బస్సులంటూ ఏడాదిగా హడావిడి చేస్తున్న ప్రభుత్వం కొనే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గత ఏడాది చివర్లో ఆర్టీసీపై సీఎం జగన్ వద్ద జరిగిన సమావేశంలో 4 వేలకు పైగా బస్సులకు కాలం చెల్లిందని అధికారులు నివేదించారు. రకరకాల ప్రతిపాదనల తర్వాత 1500 డీజిల్ బస్సులు, అద్దెకు 1000 విద్యుత్ బస్సులు తీసుకునేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టీసీ ఉనికి ప్రమాదంలో పడినట్లే అవుతుంది. - పి.దామోదర్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు
తెలుగుదేశం హామీలతో వైఎస్సార్సీపీ ఉలిక్కిపాటు - ఆర్టీసీ అధికారులతో జగన్ సర్కార్ రహస్య చర్చలు