Praja Chaitanya Sabha In vijayawada : రాష్ట్రంలో తెలుగులోనే పాలన సాగించాలని గతంలో చేసిన చట్టాన్ని అమలు చేయాలని శాసన సభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. అధికార భాషగా తెలుగును అమలు పరచాలని, తెలుగులో పాలన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను పెద్ద ఎత్తున చైతన్య సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 14న అధికార భాష దినోత్సవం జరపాలని ప్రభుత్వ ఉత్తర్వు ఉందని, తెలుగును అధికార భాషగా అమలు చేయాలని ఓ చట్టం ఉందనే సంగతి నేటి పాలకులకు తెలియక పోవడం దారుణని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో జీవోలు తేవడం పెద్ద కష్టమేమీ కాదని, తెలుగుపై ఆసక్తి, తపన లేకపోవడం వల్లే ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన తెలుగులో జరగాలని డిమాండ్‌తో తెలుగు భాషోద్యమ సమాఖ్య విజయవాడ ఎంబీవీకే భవన్లో ప్రజా చైతన్య సభ లో మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు.
తెలుగు భాషను ప్రోత్సహించని ప్రభుత్వాలు : తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు సామల రమేష్ బాబు, అధ్యక్షుడు గారపాటి ఉమా మహేశ్వరరావు, రాజ్యసభ మాజీ సభ్యులు పి. మధు, తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమ నేతలు పాల్గొన్నారు. తెలుగు భాషను పరిపాలన భాషగా అమల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కిందని, ప్రస్తుత ప్రభుత్వాలు తెలుగు భాషను ప్రోత్సహించడం లేదని తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు సామల రమేష్ బాబు అన్నారు. తెలుగు కాపాడుకునేందుకు ప్రజలకు ఏడాదిపాటు ఛైతన్య పరచేందుకు సభలు పెడతామన్నారు.
తెలుగు భాషలోనే పాలన సాగాలి : ఆంగ్ల భాషలో విద్యా బోధన తెచ్చి రాష్ట్రానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహానికి తలపెడుతున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు ఆరోపించారు. విద్యా సంస్థల్లో మాతృభాషలో బోధన ఎత్తేసి, మార్పులు చేయడం వల్ల పిల్లలు చదువుకు దూరమవుతుదంని ఆయన అన్నారు. తెలుగు భాష ,సంస్కృతి, అభివృద్దిని సీఎం జగన్ మోహన్ రెడ్డి దెబ్బ తీశారని, రాష్ట్రంలో తెలుగు భాషలోనే పాలన సాగాలని డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
"ఈవాళ అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయి. మనకు ఏదైనా పదానికి అర్థం కావాలంటే గూగుల్‌లో సర్చ్ చేస్తే వస్తుంది. గూగుల్ ద్వారా అన్ని వస్తున్నాయి కాబట్టి పరిపాలన చేయడం చాలా సులభం అవుతుంది. జీఓ తెలుగులో రాకపోవడం వాస్తవం. తెలుగులోకి తీసుకురావడం ఎంత సేపు. జీఓని తెలుగులోకి రావాలంటే ఒక బటన్ నొక్కితే వచ్చేస్తాయి. ఆసక్తి లేక తీసుకురావడం లేదు."-మండలి బుద్ధప్రసాద్, శాసన మాజీ ఉపసభాపతి
ఇవీ చదవండి