Poultry Farming Problems: "మూడు కోళ్లు - ఆరు గుడ్లు"గా కళకళలాడిన పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుతం కష్టాల్లో చిక్కుకుంది. ఒకవైపు కోళ్ల దాణా ధరలు విపరీతంగా పెరగడం, మరోపక్క గుడ్ల ధరలు పతనం కావడంతో.. రైతులు నష్టాలపాలవుతున్నారు. పెరిగిన ధరలతో కోళ్ల మేతకు వినియోగించే మొక్కజొన్న, రాగులు, సజ్జలు, నూకలు, సోయా, వేరుశనగ పిండి కొనుగోలు చేసే పరిస్థితి లేదని పౌల్ట్రీ యజమానులు వాపోతున్నారు. అదే సమయంలో డిసెంబరు నాటికి 5 రూపాయల 70 పైసలు ఉన్న గుడ్డు ధర.. ప్రస్తుతం 3 రూపాయల 85 పైసలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"గత రెండు సంవత్సరాల నుంచి దాణా రేటు వీపరితంగా పెరిగి, గుడ్డు ధర గిట్టుబాటు రాక వీపరితమైన నష్టాల్లో నడుస్తోంది. ఒక నెలకే కోడికి 20 నుంచి 25 రూపాయలు పోతోంది. ఈ నష్టాల్లో నడపటం మా వల్ల కావటం లేదు. ప్రభుత్వం నుంచి ఏవైనా సహాయ సహకారాలు అందిస్తే భాగుంటుంది."-లక్ష్మణ్‌రెడ్డి, కోళ్ల ఫారం యజమాని
గోదావరి జిల్లాల్లో రెండేళ్ల కిందట "కోటి 30 లక్షల కోళ్లు" ఉండగా.. రోజుకు కనీసం కోటి గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం కోళ్ల సంఖ్య కోటికి పరిమితమవగా.. గుడ్ల ఉత్పత్తి 80 లక్షలకు తగ్గింది. వేసవిలో ఎండల తీవ్రతకు మరో 10 లక్షలకుపైగా ఉత్పత్తి తగ్గడంతో నష్టాలు మరింత పెరిగాయని అంటున్నారు. గతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం సహా ఈశాన్య రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు కోళ్ల పరిశ్రమకు చేయూతనివ్వడంతో.. మన దగ్గర వ్యాపారం తగ్గిందని కోళ్ల పారం నిర్వాహకులు వాపోతున్నారు.
"కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అందువల్ల ఈ రోజు దాణా రేటు వీపరీతంగా పెరిగిపోయింది. మరి ఈ రోజు గుడ్డు ధరకు, దాణా ధరకు పొంతన లేదు. అంతేకాకుండా మందుల ధరలు పెరుగుతున్నాయి. వాటిని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు."-సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి
ఇతర రాష్ట్రాలు కోళ్ల పరిశ్రమకు అండగా నిలుస్తుంటే.. మన రాష్ట్రంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన రాయితీలు ఇవ్వకపోగా.. ముడిసరుకు, దాణా, ఔషధాల ధరలు పెంచడంతో నిర్వహణ భారంగా మారిందంటున్నారు. ప్రభుత్వం తగిన సాయం చేయకుంటే కోళ్ల ఫారాలు మూసివేయడం తప్ప.. మరో గత్యంతరం లేదని అంటున్నారు.
ఇవి చదవండి :