Poor Drainage System Vijayawada People Suffering: విజయవాడ మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వడంలో పాలక మండలి, అధికారులు వైఫల్యం చెందారు. డ్రైనేజీ కనెక్షన్ల సౌకర్యం కలిగిన వాటి కంటే లేని ఇళ్ల సంఖ్యే నగరంలో అధికంగా ఉంది. వీఎంసీ పరిధిలో ప్రస్తుతం 1.01 లక్షల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కనెక్షన్లు కలిగిన గృహాలు ఉండగా, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కనెక్షన్లు లేని ఇళ్లు 1.09 లక్షల వరకు ఉన్నాయి. దీనికి తోడు 2016లో 461 కోట్ల రూపాయలతో సుమారు 425 కిలో మీటర్ల పొడవునా చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో నిర్మించకపోవటంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
ఏప్రిల్ 1888 ఏప్రిల్ 1న తొలిసారిగా విజయవాడను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తర్వాత 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. అనంతరం 1981లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. విజయవాడ చుట్టుపక్కల ఉన్న గుణదల, పటమట, భవానీపురం గ్రామ పంచాయతీలతో పాటు పాయకాపురం, కుండవారి కండ్రిగ గ్రామాలను 1985లో విలీనం చేశారు. దీంతో వీఎంసీ విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అయితే అండర్ గ్రౌండ్ వ్యవస్థ నాటి నుంచి సమస్యగానే మిగిలింది. దీంతో 1967-68లో 35 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టారు.
మరోసారి 2007లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం నిమిత్తం దాదాపు 175 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా పూర్తి స్థాయిలో డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వడంలో వీఎంసీ పాలక మండలి, అధికారులు వైఫల్యం చెందారు. డ్రైనేజీ కనెక్షన్ల సౌకర్యం కలిగిన వాటి కంటే లేని ఇళ్ల సంఖ్యే అధికంగా ఉంది. వీఎంసీ పరిధిలో ప్రస్తుతం 1.01 లక్షల అండర్ గ్రౌండ్ డ్రెనేజీ కనెక్షన్లు కలిగిన గృహాలు ఉండగా, అండర్ గ్రౌండ్ డ్రెనేజీ కనెక్షన్లు లేని ఇళ్లు 1.09 లక్షల వరకు ఉన్నాయి.
Poor Drainage System in Vijayawada : నగరానికి శాపంలా డ్రైనేజీ వ్యవస్థ.. ఎక్కడ చూసినా మురుగే..
ప్రమాదాలకు నిలయాలుగా: పై కప్పులు లేని ఓపెన్ డ్రెయిన్లు వందల సంఖ్యలో బెజవాడలో ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 12వందల37 ఓపెన్ డ్రైయిన్లు ఉన్నాయి. వీటిల్లో 97 డ్రైయిన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. వీటిపై పైకప్పు, పక్క గోడలు లేకపోవటంతో ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.
ప్రాణాలు కోల్పోయిన ఘటనలు: రాజరాజేశ్వరిపేటలో ఐదేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు పోగొట్టుకోగా ఆరు మాసాల క్రితం గురునానక్ కాలనీలో ఆరేళ్ల బాలుడు మరో డ్రైయిన్‌లో పడి మృత్యువాత పడ్డాడు. గురునానక్ కాలనీ ఘటనతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ఓపెన్ డ్రైయిన్లపై మూతలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వీఎంసీ అధికారులు వెల్లడించారు. ఎన్ని డ్రెయిన్లకు పైమూతలు వేయాలనే దానిపై సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.
పట్టించుకోని అధికారులు: తర్వాత అధికారులు ఆ మాటలను గాలికి వదిలేశారు. దీంతో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి తయారయ్యింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులకు గురైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారమార్గం చూపేలా చర్యలు చేపట్టాలని నగర ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు కోరుతున్నారు.