Solar Eclipse: సూర్య గ్రహణాన్ని విద్యార్థులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో గ్రహణం పాక్షికంగా కనిపించగా.. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రాంతీయ సైన్స్ సెంటర్ కళ్లజోళ్లు సమకూర్చింది. విద్యార్థులు, కొందరు ఔత్సాహికులు ఆసక్తిగా వీక్షించారు. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో గ్రహణం కనువిందు చేసింది. గ్రహణం విడిచాక చాలా మంది భక్తులు గోదావరి నదీలో స్నానాలు ఆచరించారు.
సూర్యగ్రహణం సందర్భంగా పలుచోట్ల రోకళ్లు నిలబడ్డాయంటూ.. దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడలోని యనమలకుదురులోని ఓ ఇంట్లోని రోట్లో రోకళ్లు నిలబడగా.. కోడూరు మండలం స్వతంత్రపురంలోని ఇంకో ఇంట్లో రోకళ్లు చిన్న ప్లేటులో నిటారుగా నిలబడ్డాయని స్థానికులు తెలిపారు. గ్రహణం ప్రభావం వల్లే ఇలా జరిగిందంటూ ఇరుగుపొరుగువారంతా ఆసక్తిగా తిలకించారు.
పాక్షిక సూర్యగ్రహణం అనంతరం తిరుమలలో శ్రీవారి ఆలయం తెరుచుకుంది. దాదాపు 12 గంటల మూసివేత తరువాత రాత్రి 7.30 గంటలకు దేవాలయ తలుపులు తీశారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించిన తితిదే.. 8.30 గంటలకు సర్వదర్శనానికి భక్తులకు అనుమతించింది. అలాగే గ్రహణం అనంతరం రాత్రి 7.30 గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును తెరిచిన సిబ్బంది.. వంటశాల శుద్ధి చేసిన తర్వాత భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.
ఇవీ చదవండి: