Cm Jagan Anakapally Tour : అన్నొస్తున్నాడంటే ఆ ప్రాంత ప్రతిపక్షనేతల్నిగృహ నిర్బంధం చేయాచాల్సిందే.. ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్లు.. బస్ స్టేషన్‌లో పడిగాపులు పడాల్సిందే.. అనే విధంగా సీఎం జగన్ పర్యటనలు ఉంటున్నాయి. నర్సీపట్నం పర్యటన కూడా అలానే జరిగింది. ఉదయమే టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఉద్యోగస్తులు, ప్రయాణికులకు బస్సులు లేక.. నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వ తీరుపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో.. కసింకోట మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కసింకోట మండల టీడీపీ అధ్యక్షుడు మురళి, తెలుగు రైతు సంఘం నాయకుడు రమణమూర్తి, సూర్యనారాయణను.. ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తెల్లవారకముందే తెలుగుదేశం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 60 మందివరకు తెలుగుదేశం నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరిలో కొందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఖండించారు. జగన్ను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. చెత్త పాలన, అసమర్థ సీఎం అంటూ.. వైసీపీకి చెందిన సొంత సామాజిక వర్గం నేతలే తిరుగుబాటు చేస్తున్నారని విమర్శించారు.
నర్సీపట్నంలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపనంటూ సీఎం జగన్ ప్రజల్ని మభ్యపెట్టారని.. తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుమతుల్లేకుండా మెడికల్ కాలేజ్ ఎలా సాధ్యమని నిలదీశారు. సీఎంపై పోలీసులు ఛీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
"ఏదైనా మెడికల్ కళాశాల స్థాపించేటప్పుడు కేంద్రం అనుమతి అవసరం. కేంద్రం నుంచి అనుమతులు లేకుండా మెడికల్ కళాశాలను ఎలా ప్రారంభిస్తారు. కళాశాలలో ఎన్ని సీట్లకు అనుమతినివ్వాలి లాంటి అంశాలను కేంద్రం నిర్ణయిస్తుంది. ఇంతా దారుణంగా ఎలా చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా. ప్రజలను మభ్య పెడుతున్నారు." -అయ్యన్నపాత్రుడు, మాజీమంత్రి
సీఎం జగన్ పర్యటన కోసం ఆర్టీసీ బస్సులు తరలించడంతో.. స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకి చెందిన సుమారు 100 బస్సుల్లో.. సీఎం పర్యటన కోసం 78 బస్సులు కేటాయించారు. ఈ డిపో నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. అనకాపల్లి, చోడవరం, తుని, విశాఖ వంటి నిరంతర సర్వీసులను గణనీయంగా తగ్గించారు. ఫలితంగా ప్రయాణికులు, ఉద్యోగులు.. తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాపోయారు. బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: