Nara Lokesh on Bandaru Arrest: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని హైడ్రామా నడుమ పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఉద్రిక్తతల నడుమ ఆయనకు.. 41A, 41B నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. తొలుత అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు..కొద్దిసేపటి తర్వాత ప్లాన్ మార్చి అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా గుంటూరు జిల్లాకు తరలించారు.
Nara Lokesh Tweet on Bandaru Arrest: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. బండారు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ముందుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ..''వైఎస్సార్సీపీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలంతా కూసే రోత బూతు కూతలపై పోలీసులు ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని మాత్రం టెర్రరిస్టులా అరెస్టు చేశారు. వైసీపీ పార్టీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా..? ఇదేం అరాచక పాలన' అని ఆయన సామాజిమ మాధ్యమాల వేదికగా నిలదీశారు.
Achchennaidu Fires on YCP Leaders: తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు అప్రజాస్వామికమని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హద్దులు మీరి వ్యవహరిస్తున్న వైసీపీ నేతలను కట్టడి చేయకుండా.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు బద్దలు కొట్టి, అరెస్ట్ చేసే అంత నేరం బండారు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వేధింపులు, కక్ష సాధింపులే అజెండాగా పాలన కొనసాగిస్తున్న జగన్‌కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు.
''ప్రజల అభివృద్ధి, సంక్షేమం గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. వైసీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చినా గంటల వ్యవధిలోనే 4 జిల్లాలు దాటి బండారు ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించరు..?. తాడేపల్లి డైరెక్షన్‌లో అక్రమ కేసులు పెడుతున్న డీజీపీకి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రశ్నించే గొతులను తొక్కుతున్న జగన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓటుతో ప్రజలే తొక్కుతారు.''- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
TDP Leaders Condemned Bandaru Arrest: బండారు అరెస్టును టీడీపీ నేతలు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావులు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీ నాయకులను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమ కేసులతో బండారును వేధిస్తున్నారని ఆగ్రహించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్పిచెప్పారు.
Bandaru Satyanarayanamurthy Arrest: ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో బండారు వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ క్రమంలోనే పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బండారు ఇంటికి భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరమేంటని మండిపడ్డాయి. సాయంత్రం వరకు హైడ్రామా నడిపిన పోలీసులు బండారుకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు.