Strike Continues: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కర్నూలు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. మూడో రోజు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ..కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా బేతంచర్లలో కార్మికులు విధులు బహిష్కరించి ర్యాలీ తీశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వినాయక సర్కిల్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కార్మికులకు సీపీఐ మద్దతు తెలిపింది. సమస్యలు తీర్చే వరకు సమ్మె విరమించేంది లేదని కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. వీరికి కౌలు రైతుల సంఘం మద్దతు తెలిపింది. మోకాళ్లపై కూర్చొని సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. కరోనా సమయంలో కార్మికులు చేసిన త్యాగాలను ప్రభుత్వం మరిచిపోవడం బాధాకరమన్నారు. పోరాటం ఉద్ధృతం కాకముందే డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.
అనకాపల్లిలో జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మిని అడ్డుకున్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. కార్మికుల సమ్మెతో వీధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకు పోయింది.
విజయనగరంలో మున్సిపల్ కార్మికులు కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
జీతం పెంపు మినహా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. రేపు కార్మికులను చర్చలకు ఆహ్వానించామన్న మంత్రి.. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: