Flood surge in Muneru: తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. మునేరు వరద ఉద్ధృతి పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై వరద ప్రవాహం యధావిధిగా కొనసాగుతోంది. ప్రస్తుతం మునేరుకు 1,92,000 క్యూసెక్కుల వరద వస్తోంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉద్ధృతంగా ఉండటంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గూడ్స్ వాహనాలను కొన్నింటిని పోలీసులు అతి కష్టం మీద వరల మీదుగా పంపించారు. అనంతరం చీకటి పడటంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. వరద ఇంకా పెరుగుతుందనే అంచనాతో అధికారుల అప్రమత్తమయ్యారు. ఈ పరిస్థితుల్లో జాతీయ రహదారిపై వాహనాలను పలుమార్గాల ద్వారా మళ్లించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి ఐతవరం గ్రామం వద్ద బస్సులు, ఇతర పెద్ద వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రంతా టోల్ ప్లాజా వద్దే పిల్లలు, మహిళలు.. విజయవాడ – హైదరాబాద్ మధ్య ఐతవరం జాతీయ రహదారిపై మునేరు వరద ప్రవాహంతో రాకపోకలు ఆగిపోయాయి. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి నందిగామ మండలం అంబరపేటకు చెందిన 70 మంది కీసర టోల్ ప్లాజా వద్ద చిక్కుకుపోయారు. గురువారం మధ్యాహ్నం కొండపల్లికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా వరద బారిన పడ్డారు. రాత్రంతా తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడ్డామని.. ఎవరూ పట్టించుకోలేదని మహిళలు వాపోయారు. తమను వీలైనంత త్వరగా ఇళ్లకు చేర్చాలని వేడుకుంటున్నారు.
హైద్రాబాద్- విశాఖ వాహనాలకు దారి మళ్లింపు.. రహదారిపైకి వరద నీరు చేరడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉద్ధృతి తగ్గే వరకు ఈ మార్గంలో వాహనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలను వేరే దారికి మళ్లిస్తున్నట్లు జిల్లా సీపీ కాంతిరాణా తెలిపారు. హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే వాహనాలు నార్కెట్పల్లి, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇంబ్రహీంపట్నం, కీసర వద్ద ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయని సీపీ తెలిపారు. వాహనదారులు, స్థానికులు వరదల్లోకి వాహనాలతో వెళ్లొద్దని సీపీ సూచించారు.
పరిశీలించిన అధికారులు, నాయకులు.. జాతీయ రహదారిపై వస్తున్న వరదను డీసీపీ విశాల్ గున్ని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పరిశీలించారు. 65వ జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్రం నుండి భారీగా వరద వస్తుందని డీసీపీ తెలిపారు. పోలీసు డిపార్ట్మెంట్ వారు అక్కడే ఉండి.. వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో ఎక్కడ కుడా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసామని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తెలిపారు. వరద పూర్తిగా తగ్గిపోయే వరకు వాహనదారులు ఎవరు కూడా జాతీయ రహదారిపైకి రావద్దని కోరారు. నియోజకవర్గంలో వరదలో చిక్కుకుంటే కాపాడటానికి రెస్క్యూ టీం, పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిని ఎమ్మెల్యే జగన్ మోహన్రావు, ఆర్టీవో రవీంద్రరావు పరిశీలించి.. ప్రయాణికులు భద్రతపై పోలీసు అధికారులతో మాట్లాడారు.