Medicines not available to kidney sufferers: డయాలసిస్ చేయించుకునే కిడ్నీ బాధితులకు అందాల్సిన మందులు పక్కదారి పడుతున్నాయి. కిడ్నీ రోగులకు చేరాల్సిన మందులు బ్లాక్ అవుతున్నాయి. కిడ్నీబాధితులకు అండగా నిలబడాలన్న రాష్ట్ర ప్రభుత్వ సదాశయం ఓ ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రి ఉద్యోగుల నిర్వాకం మూలంగా నిర్వీర్యమవుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న విలువైన మందులు పక్కదారి పడుతున్నాయి. తిరువూరు ప్రాంతీయ వైద్యశాల అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ మందులు ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది.
ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు.. : ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో అత్యధికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం నెలకొల్పిన డయాలసిస్ కేంద్రం పర్యవేక్షణ బాధ్యతను ఓ ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రికి అప్పగించారు. డయాలసిస్ నిమిత్తం వచ్చే బాధితులకు అవసరమైన పరీక్షలు ఆస్పత్రిలోనే ఉచితంగా చేసి, ప్రభుత్వం సరఫరా చేసిన మందులతో ఉన్నత వైద్యసేవలు అందించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై వాటాల కోసం కొన్ని పరీక్షలతో పాటు మందులకు కూడా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటూ రికమండ్ చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందులు పక్కదారి: క్రియాటిన్ ఎక్కువగా ఉన్న వారికి అవసరమైన డయాలసిస్ చేయడానికి వీలుగా తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో రూ.3 కోట్లతో నిర్మించిన డయాలసిస్ కేంద్రాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రి సహకారంతో బాధితులకు ఇక్కడ డయాలసిస్ చేస్తున్నారు. అయితే బాధితులకు సరఫరా చేస్తున్న మందులను ఇక్కడి కేంద్రంలో పని చేస్తున్న సాంకేతిక నిపుణుడు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి మరింత బలం చేకూర్చుతూ సీసీ కెమెరా ఫుటేజీ ఆధారాలు వెలుగు చూశాయి.
సీసీ కెమారాలో దృశ్యాలు: మంగళవారం మధ్యాహ్నం తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో నిల్వ చేసిన ఐదు బాక్సులు, రెండు సంచుల్లోని మందులను రిక్షాపై బస్టాండ్ సెంటర్ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన ఆధారాలు లభించినట్లు తెలిసింది. ప్రైవేట్ ఆస్పత్రి మెడికల్ దుకాణం నిర్వాహకుడు, డయాలసిస్ కేంద్రం సాంకేతిక నిపుణుడు, రిక్షా కార్మికుడు వీటిని మొదటి అంతస్తు నుంచి కిందకు దించడం, అక్కడినుంచి తరలించడం సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమైందని సమాచారం. సంక్రాంతి పండుగ సమయంలో కూడా కొన్ని బాక్సులు కారులో తరలించడం కూడా వెలుగు చూసిందంటున్నారు.
మందులు అందక..: రూ.లక్షల విలువ చేసే డయాలసిస్ బాధితులకు వినియోగించే మందులను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకొంటున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయాలసిస్ నిమిత్తం వచ్చే బాధితులకు అవసరమైన పరీక్షలు ఆస్పత్రిలోనే ఉచితంగా చేసి, ప్రభుత్వం సరఫరా చేసిన మందులతో ఉన్నత వైద్యసేవలు అందించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై వాటాల కోసం కొన్ని పరీక్షలతో పాటు మందులకు కూడా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటూ రికమండ్ చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెకు ఉంటున్న ఇల్లు ఖాళీగా ఉండటంతో మందులను దాచి ఉంచుతున్నారు. అక్కడ రహస్యంగా దాచిన మందులను గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆస్పత్రికి విక్రయించి తమ అక్రమ తరలింపును నిరాఘాటంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: