Manholes Disorganized Management in Vijayawada : విజయవాడలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారులు మాత్రం భూగర్భ నీటిపారుదల వ్యవస్థ నిర్వహణను గాలికి వదిలేశారు. చిన్నపాటి వర్షానికే మ్యాన్‌హౌల్స్ పొంగి చెత్త చెదారం రోడ్లపైకి చేరుతోంది. దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్స్‌ను సరి చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు మాత్రం మూల్యం చెల్లించుకుంటున్నారు.
Manholes are Dilapidated in Vijayawada : విజయవాడ నగరంలో ఏ రహదారి చూసినా నిత్యం రద్దీగానే ఉంటుంది. నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వేలాది మంది విజయవాడకు వస్తుంటారు. భూగర్భ నీటి పారుదల వ్యవస్థలో భాగంగా రహదార్లపై నిర్మించిన మ్యాన్ హోల్స్ ప్రయాణికుల సహనానికి పరీక్షలు పెడుతున్నాయి.
రహదార్ల ఎత్తుతో పోల్చి చూస్తే చాలాచోట్ల మ్యాన్ హోల్స్ కుంగిపోయాయి. మ్యాన్ హోల్స్ కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. ఇంకొన్నిచోట్ల కుంగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్.. రహదారి ఉపరితలం కంటే పైకి లేచి ప్రమాదకరంగా కన్పిస్తున్నాయి. ఇవి నిత్యం ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.
Vijayawada People Suffering with Manholes : అడ్డదిడ్డంగా ఉన్న మ్యాన్ హోల్స్‌తో ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక వర్షం వస్తే అంతే సంగతులు. మ్యాన్ హోల్స్‌తో ప్రమాదం రెండింతలు అవుతుంది. రహదారిపై నీరు నిలిచి ఏది రహదారో, ఏది గుంతో, ఏది మ్యాన్ హోలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నింటికి అధికారులు మరమ్మతులు చేపడుతున్నా మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుంది.
పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో మదర్ థెరిస్సా కూడలి సమీపంలో మొగల్రాజపురం రావి చెట్టు వద్ద పడమట, లబ్బీపేట, కృష్ణలంక, రాణిగారి తోట, కరెన్సీ నగర్, గుణదల ప్రాంతాల్లోనూ సవ్యంగా లేని మ్యాన్ హోల్స్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి. దెబ్బతిన్న మ్యాన్ హోల్స్ రాత్రిపూట కన్పించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.
Poor Drainage System in Vijayawada : నగరానికి శాపంలా డ్రైనేజీ వ్యవస్థ.. ఎక్కడ చూసినా మురుగే..
మ్యాన్ హోల్స్ సక్రమంగా లేని పరిస్థితుల్లో వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపుతూ ఓ డ్రైవ్‌ను చేపట్టాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మ్యాన్ హోల్స్ నిర్వహణపై అధికారుల్లో కన్పించిన శ్రద్ధ, చిత్తశుద్ధి ఇప్పుడు కన్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రహదార్లపై ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్స్ సక్రమ నిర్వహణపై అధికారులు, ప్రజా ప్రతినిధులు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని నగర వాసులు కోరుతున్నారు.