Lorry Owners Association Press Meet: సరుకు రవాణా వాహనాలపై 25 నుంచి 30 శాతం మేర త్రైమాసిక పన్ను పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ వలన.. రవాణా రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దీనిని అమలుచేస్తే రాష్ట్రంలోని రెండున్నర లక్షల లారీలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని పేర్కొంది. రవాణా రంగానికి ఆయువుపట్టు అయిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలపై సుమారు 15 కోట్ల రూపాయల వరకు.. మొత్తంగా సరకు, ప్రయాణికుల రవాణా వాహనాలపై ఏటా 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని.. అసోయేషన్ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణస్వామి, ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి వీరవెంకయ్య తెలిపారు. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు: త్రైమాసిక పన్నుపెంపు నిర్ణయంపై మూడు నెలల క్రితం.. రాష్ట్ర రవాణాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. దీనిని ఉపసంహరించుకోవాలని.. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున.. సీఎంకు, రవాణాశాఖ ఉన్నతాధికారులకు లేఖలు పంపినా, వినతిపత్రాలు ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదని పేర్కొన్నారు.
గుదిబండగా మారనున్న పన్ను పెంపు: 2020-2021 సంవత్సరాల్లో కరోనా వల్ల తీవ్ర సంక్షోభం చవిచూసిన రవాణా రంగాన్ని డీజిల్ ధరల పెరుగుదల కుంగదీస్తోందని.. నానాటికీ ఆటుపోట్లతో, అంతంతమాత్రంగా ఉన్న రవాణారంగానికి త్రైమాసిక పన్ను పెంపు చర్య గుదిబండగా మారనుందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇక్కడి కంటే డీజిల్ ధరలు తక్కువగా ఉన్నందున పక్కరాష్ట్రాల కిరాయిలతో పోటీ పడలేక ఏపీ రవాణా రంగం డీలాపడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం శూన్యం: త్రైమాసిక పన్ను పెంపుతో మరింత నష్టాల ఊబిలోకి జారుతుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. కరోనా కష్టకాలంలో పక్క రాష్ట్రాలు పన్ను మినహాయింపులు ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కనీస ప్రోత్సాహకాలు రవాణా రంగానికి అందించలేదని అన్నారు. త్రైమాసిక పన్నుపెంపు యోచనపై నెలరోజుల్లో అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలపాలని.. తర్వాత ఇది అమల్లోకి వస్తుందని తాజా నోటిఫికేషనులో పేర్కొన్నారని గుర్తుచేశారు. గతంలో లారీ ఓనర్ల సంఘాల అభ్యంతరాలు, లేఖలు, వినతిపత్రాలూ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. ఏకపక్షంగా హరితపన్ను 200 రూపాయల నుంచి గరిష్టంగా 20వేల రూపాయల పైగా పెంచిందని అన్నారు.
భారీగా పన్ను పెంపు: గతంలో వాహన ఫిట్నెస్ ఛలానా 920 రూపాయలుంటే 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు అది ఇప్పుడు రూ. 13 వేల 500 కు పెరిగిందని... కొత్తగా కొనుగోలుచేసే లారీపై పన్ను శాతం.. 12 నుంచి 18 శాతానికి రాష్ట్రప్రభుత్వం పెంచిందని తెలిపారు. గతంలో రూ. 30 లక్షల విలువైన లారీ కొనుగోలుపై చెల్లించే మూడున్నర లక్షల రూపాయల పన్ను కాస్తా.. ఐదున్నర లక్షల మేర పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం 6 టైర్ల లారీకి త్రైమాసిక పన్ను 3,940 రూపాయలు ఉండగా..మరో 1,030 పెంచేలా ప్రతిపాదించారని.. 10 టైర్ల లారీకి 6,580 రూపాయల పన్ను ఉండగా.. 1,810 రూపాయలు, 12 టైర్ల లారీకి రూ.8,520 పన్నుఉండగా.. మరో 2,390 రూ.లు పెంచనున్నారని వివరించారు. 14 టైర్ల లారీకి రూ. 10,460 త్రైమాసిక పన్ను ఉండగా మరో 2,970 రూపాయలు పెంచనున్నట్లు నోటిఫికేషనులో పేర్కొన్నారని తెలిపారు.
జీవో ఉపసంహరించుకోవాలి: గత ఏడాది వాహనానికి రెండొందల రూపాయలున్న పర్యావరణ పన్ను ఏకంగా 20 వేల రూపాయల పైగా పెంపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సంవత్సరం ప్రారంభంలోనే త్రైమాసిక పన్నుల పెంపునకు కసరత్తు చేయడం రవాణారంగానికి నష్టదాయకమని.. త్రైమాసిక పన్నుపెంపు యోచన పునరాలోచించాలని.. ప్రాథమిక జీవో ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: