Koulu Raithula Padayatra: కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన "కౌలు రైతు రక్షణ" యాత్ర మంగళగిరిలోని C.C.L.A. కార్యాలయానికి చేరుకుంది. ఈ నెల 5వ తేదీన అనకాపల్లి జిల్లా నుంచి ఒక జీపులో, 7న నెల్లూరు నుంచి మరో జీపులో యాత్ర ప్రారంభమైంది. వీటితో పాటు ఈ నెల 10న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు నుంచి మంగళగిరి సీసీఎల్ఎ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ మూడు యాత్రలు విజయవాడ మీదుగా మంగళగిరి చేరుకున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో భూమి ఉన్న రైతులే వ్యవసాయం గిట్టుబాటు కాక క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని అలాంటిది భూమి లేని కౌలు రైతులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే ఎలా అని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పులు పాలై అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులు మంజూరు చేయడానికి భూ యజమాని సంతకం కావాలనే నిబంధనని విరమించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూ యజమాని సంతకం లేకుండా పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, ప్రకృతి వైపరిత్యాలకు నష్టపోయే కౌలు రైతులకు పంట నష్టపరిహారం, పంటల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రుణాలు, రైతు భరోసా అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్లైందని విమర్శించారు. అంతకుముందు గ్రామసభల ద్వారా ఎల్ఈసీ కార్డులు ఇచ్చేవారని తెలిపారు. ఆ కార్డుల ద్వారా పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమాలు, బ్యాంకు లోన్లు వచ్చేవన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక భూ యజమాని సంతకం పెడితేనే కార్డు ఇస్తామని చట్టంలో మార్పు చేశారని పేర్కొన్నారు. నేడు సంతకం పెట్టడానికి భూ యజమానులు ఎవ్వరూ ముందుకు రావడం లేదని.. దాంతో కార్డులు మంజూరు కావని.. కార్డు లేకపోతే పథకాలు ఏవీ రావని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 32లక్షల మంది కౌలు రైతులు ఉంటే.. 5లక్షల 70వేల మందికి కార్డులు ఇచ్చినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. ఆ 5లక్షల్లో తమ లెక్క ప్రకారం 40శాతం బోగస్ లెక్కలని స్పష్టం చేశారు. వాస్తవంగా సాగుచేసే కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని.. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలే అని ధ్వజమెత్తారు. కౌలు రైతుల జీపు యాత్ర, పాదయాత్రకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.