Jagan government is failing to manage Garbage: పట్టణాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా లేదని, ఘనవ్యర్థాల యాజమాన్యాలను విధిగా చేపట్టాలని సీఎం జగన్ 2019 అక్టోబర్‌లో పురపాలకశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు ఆదేశాలిచ్చారు. గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలని, గత ఏడాది అక్టోబర్ 7న మరోసారి సూచనలు చేశారు. ముఖ్యమంత్రి మాటలు, అధికారులకు ఆయన ఇచ్చిన ఆదేశాలు వింటే,రహదారులపై ఇక చెత్త కనిపించదని, పట్టణాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుందన్న అభిప్రాయం కలగడం సహజం. కానీ, నాలుగున్నరేళ్ల వ్యవధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఇళ్లు, దుకాణాల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రతినెలా ప్రజల ముక్కుపిండి వినియోగ రుసుములు వసూలు చేయడం కంటే గొప్పగా చేసిందేమీ లేదు. పట్టణాల్లో పోగుపడుతున్న చెత్త నుంచి ఎరువులను తయారీ చేసే కేంద్రాల నిర్వహణపై దృష్టి నిలపడంలేదు. డంపింగ్ యార్డుల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు పనులూ నత్తకు నడకలు నేర్పుతున్నాయి.
మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు: భూగర్భ మురుగునీటి వ్యవస్థ అందుబాటులో లేనిచోట్ల కాలువల్లో ప్రవహించే మురుగు నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టు కూడా పట్టాలెక్క లేదు. దాదాపు 65 పుర, నగరపాలక సంస్థల్లో మురుగు నీటిని నేరుగా నదుల్లోకి వదులుతున్నారు. ఈ తీరును జాతీయ హరిత ట్రైబ్యునల్ అనేక సందర్భాల్లో తప్పుపట్టింది. సమస్య పరిష్కారానికి నదులకు, చెరువులకు సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికీ పూర్తిగా అమలవలేదు. తొలిదశలో 28 పట్టణాల్లో ఎస్‌టీపీలను నిర్మించాలనుకున్నా పూర్తిస్థాయిలో పనులు మొదలవలేదు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక సంస్థలు కూడా వాటా నిధులు సమకూర్చాలి. ఆదాయం సరిగాలేని మున్సిపాలిటీలు చేతులెత్తేస్తున్నాయి. దాంతో ప్రకాశం, అనంతపురం, ఉమ్మడి కర్నూలు, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో చాలాచోట్ల మురుగు నీటిని నదుల్లోకి వదిలేస్తున్నారు.
ప్రభుత్వ హయాంలో భారీ ప్రణాళిక: రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో రోజూ 6 వేల 980 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నులు విశాఖ, గుంటూరులోని ఎనర్జీ తయారీ సంస్థలకు, సిమెంట్ తయారీ కంపెనీలకు వెళుతున్నాయి. మిగిలిన 4 వేల 980 మెట్రిక్ టన్నుల వ్యర్థాల్లో ప్లాస్టిక్ వస్తువులు వేరుచేయగా మిగిలే తడి చెత్త నుంచి ఎరువులను తయారు చేసి పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపాలని గత ప్రభుత్వ హయాంలో భారీ ప్రణాళిక తయారు చేశారు.అందు కోసం అప్పట్లో 39 పట్టణాల్లో చెత్త నుంచి ఎరువుల తయారీ కేంద్రాలను ప్రారంభించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో విజయవాడ, కాకినాడ, బొబ్బిలిల్లో ఉత్తమ విధానాలను అవలంబిస్తున్నట్లు నీతి ఆయోగ్ సైతం గుర్తించి అప్పటి ప్రభుత్వాన్ని అభినందించింది.
ఎనిమిది నెలలుగా జీతాలు బంద్, పండుగనాడూ పస్తులే - వాహనాలను నిలిపేసి ఆందోళనకు దిగిన 'క్లాప్' డ్రైవర్లు
నదుల్లో, చెరువుల్లో వదిలేస్తున్నారు: సెప్టిక్ ట్యాంకులు నిండాక వాటిలోని నీటిని శుద్ధి చేసేందుకు 32 పట్టణాల్లో ‘సెప్టేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల’ ఏర్పాటు 5 చోట్లకే పరిమితమైంది. నరసాపురం, రాజాం, బొబ్బిలి, పలమనేరు, వినుకొండల్లో వీటిని ఏర్పాటు చేశారు. సెప్టిక్ ట్యాంకుల్లో నీటిని ప్రత్యేక వాహనాల ద్వారా ప్లాంట్లకు తీసుకొస్తారు. శుద్ధి చేశాక వచ్చిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. ఇలాంటి ప్లాంట్లు మరో 13 చోట్ల ఏర్పాటుకు ఇటీవల టెండర్లు పిలిచారు. ప్లాంట్లు అందుబాటులో లేనిచోట ట్యాంకుల్లోని నీటిని వాహనాల్లో తెచ్చి నదుల్లో, చెరువుల్లో వదిలేస్తున్నారు. దాంతో నీటి కాలుష్యంతోపాటు పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. సాలూరు, అనకాపల్లి, తుని, మంగళగిరి, జగ్గయ్యపేట, ఉయ్యూరు, హిందూపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, ఏలూరు తదితర పట్టణాలను ఇలాంటి సమస్యలు వేధిస్తున్నాయి.
పర్యావరణ సమస్యలు: లక్షకు మించి జనాభా కలిగిన నగరాలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న పట్టణాల్లోని డంపింగ్ యార్డుల్లో,3-4 దశాబ్దాలుగా పేరుకుపోయిన, లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. వాటికి పరిష్కారం చూపే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పేరుకుపోయిన వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసి, మిగతా వాటినిని పిండిగా చేస్తారు. ఇలా ఖాళీ అయ్యే యార్డులను ఉద్యానవనాలుగా అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక. తొలి దశలో 32 యార్డుల్లో 86 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయో మైనింగ్ విధానం ద్వారా ప్రాసెస్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 316 కోట్ల రూపాయలు కేటాయించింది. లక్ష కంటే మించి జనాభా కలిగిన నగరాలకు ప్రాజెక్టు వ్యయంలో 33 శాతం, లక్ష కంటే తక్కువ జనాభాగల పట్టణాలకు 50 శాతం చొప్పున కేంద్రం నిధులు ఇచ్చింది. మిగతా మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలి. రాష్ట్ర వాటా నిధులు సరిగా కేటాయించని కారణంగా అనేకచోట్ల ఇందుకు సంబంధించిన పనులు మందకొడిగా సాగుతున్నాయి.
విజయవాడ, అనంతపురం, తిరుపతి, ధర్మవరం, పులివెందుల, నూజివీడు, యలమంచిలి, కొవ్వూరు, బద్వేల్, మైదుకూరు, రాయచోటి తదితర ప్రాంతాల్లోని యార్డుల్లో వ్యర్థాలకు పరిష్కారం చూపారు. మిగిలిన 21 చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా 56 లక్షల 33 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయాల్సి ఉంది.