Jada Shravan on Liquor Scam: 'ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు నమోదయ్యాయి. 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయి. దశల వారీగా మద్య నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మద్యం తయారీదారులు, విక్రయదారులను జైలుకు పంపుతామన్నారు. తయారీదారుల జాబితా విడుదల చేశాం.. ఎప్పుడు అరెస్టు చేస్తారు..?, లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల లెక్కలేవీ..?, మద్యం దుకాణాల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఎందుకు కన్పించవు..?. 30వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైఎస్సార్సీపీ కొల్లగొట్టింది. మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రిని కోరాం.' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై.. జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్ స్పందించారు. మద్యం మాఫియాపై పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు శుభపరిణామం అని అన్నారు.
Jada Shravan Comments: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న మద్యం స్కాంపై జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మద్యానికి సంబంధించి..పలు కీలక విషయాలను ప్రస్తావించారు. జడ శ్రావణ్ మాట్లాడుతూ..''ఏపీలో మద్యం మాఫియాపై పురందేశ్వరి వ్యాఖ్యలు శుభపరిణామం. రాష్ట్రంలోని ల్యాండ్, శాండ్, మైన్, లిక్కర్ మాఫియాకు వైసీపీ కేరాఫ్ అడ్రస్. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయి. దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధమన్న హామీ ఏమైంది జగన్..?. ఏపీలో మద్యం స్కామ్‌పై కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి లేఖ రాస్తాం. స్పందన రాకుంటే కోర్టుల్లో పోరాటం చేస్తాం. మద్యం స్కామ్ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్‌కు తరలిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జైభీమ్ భారత్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయాలని భావిస్తున్నా.'' అని ఆయన అన్నారు.
Purandeswari Comments on AP Liquor Policy : 'మద్య నిషేధం హామీ ఏమైంది..? లిక్కర్ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి'
Jada Shravan Fire on Cm Jagan: ఏపీలో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న మద్యం, ఇసుక పాలసీలను ఈ జగన్ సర్కార్ 'ప్రభుత్వ' ఆధీనంలోకి తీసుకొచ్చి.. తన అనుచరులకు కట్టబెట్టిందని జడ శ్రావణ్ దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలోనే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. నాసిరకం మద్యం సరఫరా చేసి జగన్ సర్కార్.. ఆడపడుచుల తాళిబొట్లు తెంపుతోందని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయం కోసం మద్యం ప్రియుల ఆరోగ్యాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని జడ శ్రావణ్ మండిపడ్డారు. దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధమని ప్రజలను, మహిళలను ముఖ్యమంత్రి జగన్ దారుణంగా మోసం చేశారని ఆగ్రహించారు. కొత్త కంపెనీలను బినామీలకు కట్టబెట్టి.. జగన్ టాక్స్‌తో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.