Irregularities in Government Teacher Transfers : దొడ్డిదారిన ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి వెన్నంటి ఉండే ఓ ఉద్యోగి ఇందులో చక్రం తిప్పుతున్నారు. బదిలీ కోసం సిఫార్సు లేఖకు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 50 వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఓ ఎంపీ లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. కొందరు మంత్రులు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నారు. సిఫార్సు లేఖ నుంచి బదిలీ ఉత్తర్వులు పొందే వరకు ఒక్కో ఉపాధ్యాయుడు 4లక్షల నుంచి 5లక్షల రూపాయల వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది. సాధారణ కౌన్సెలింగ్ బదిలీలు పూర్తయ్యాక ఉపాధ్యాయులు డిప్యుటేషన్, బదిలీలకు గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister Office )నుంచే అనుమతులిచ్చేవారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా సిఫార్సు బదిలీలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
MLAs Taking Bribe to Transfer Teachers in AP : దొడ్డిదారి బదిలీలకు 1200 మంది ఉపాధ్యాయుల పేర్లతో జాబితా రూపొందించారు. ఇది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఉంది. బదిలీలు కోరుకునేవారికి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి, MP నుంచి లేఖలు తెచ్చుకోవాలని మంత్రితోపాటు ఉండే ఓ వ్యక్తి సూచిస్తున్నారు. సిఫార్సు లేఖ సమకూర్చుకున్నా ఒక్కో బదిలీకి 3 లక్షల నుంచి 4 లక్షలు రూపాయల వసూలు చేస్తున్నారు. గతంలోనూ ఈయనపై పలు ఆరోపణలున్నాయి. ప్రాంతాలవారీగా ధరలు నిర్ణయించి మంత్రి పేషీలో వసూలు చేస్తున్నారు.
అక్రమంగా 129 మంది ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్ధం..!
పైరవీ బదిలీలు : విజయవాడలాంటి నగరంలో పోస్టింగు కోసం 3 నుంచి 4 లక్షల రూపాయలు తీసుకుంటుండగా, మండలకేంద్రానికి అయితే 3 లక్షలు, ఇతర ప్రాంతాలకు రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. పైరవీ బదిలీలు పొందిన వారికి పోస్టింగులు ఇప్పించే వరకు పర్యవేక్షించడానికి - కమిషనరేట్‌లోని ఓ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీల్లో రెండు ఉపాధ్యాయ సంఘాల నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
Government Teacher Transfers 2023 In AP : సాధారణ బదిలీలు జూన్‌తో ముగిశాయి. వెంటనే జులైలో మంత్రి పేషీ కొన్ని సిఫార్సు బదిలీలు చేసింది. దీనిపై ఆరోపణలు రావడంతో ఆగస్టులో కేవలం మహిళా టీచర్లకు మాత్రమేనంటూ 1400 మందిని బదిలీ చేశారు. వీరిలో 600 మందికి పోస్టింగులు ఇచ్చారు. కొన్ని చోట్ల ఖాళీలు లేకపోవడం, ఏకోపాధ్యాయ బడులు, అప్పటికే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండడం, కోర్టు కేసుల్లాంటి వాటి కారణంగా కొందరికి పోస్టింగులు ఇవ్వలేదు.
వీరందరూ పోస్టింగుల కోసం ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు. రాయలసీమలో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఓ జిల్లా విద్యాధికారి ఈ సిఫార్సు బదిలీల్లో వచ్చినవారికి పోస్టింగు ఇచ్చేందుకు భారీగా వసూలు చేశారు. ప్రకాశం జిల్లాలో 84 వరకు సిఫార్సు బదిలీలుండగా ఒక్క ఎమ్మెల్యేవే. వీటిల్లో 90 శాతం లేఖలున్నాయి. వీటికి పోస్టింగులిచ్చేందుకు ఓ విద్యాధికారి దండుకున్నట్లు ఆరోపణలున్నాయి.
గుంటూరు జిల్లా పరిధిలోని ఓ MLC.. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని ఉపాధ్యాయులకూ సిఫార్సు లేఖలిచ్చారు. మంత్రి పేషీలో ఎలాంటి డబ్బులు అవసరం కాకుండా చూస్తానంటూ మరో MLC.. 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. విజయనగరంలో ఓ అధికారి గత ఆగస్టులో అత్యధికంగా సిఫార్సు బదిలీలు చేశారు. శ్రీకాకుళంలో గతంలో పని చేసిన ఓ అధికారి పైరవీ బదిలీలు చేయబోనని చెప్పడంతో ఆయన్ను బదిలీ చేసి, మరొకరిని నియమించి పని పూర్తి చేయించుకున్నారు.