Lorry Owners Protest Against Increase In Toll Tax : ఏప్రిల్ 1 నుంచి టోల్ టాక్స్‌లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తేలికపాటి వాహనాలపై ట్రిప్పుకు 5 శాతం, భారీ వాహనాలపై ట్రిప్పుకు 10 శాతం మేర టోల్ చార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని లారీ ఓనర్లు మండిపడుతున్నారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోషియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.
తీవ్ర సంక్షోభంలో రవాణా రంగం : ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి పన్నుల పోటు విధించారని, ఇది చాలదన్నట్లు టోల్ టాక్స్‌లు పెంచడం దుర్మార్గమని అసోషియేషన్ నేతలు, లారీ యజమానులు అంటున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడీ మరీ డీజిల్, ఆయిల్ ధరలు విపరీతంగా పెంచుతుండటం, పన్నుల పెంపు వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని టోల్ టాక్స్ పెంపు వల్ల లారీ యజమానుల నడ్డి విరుగుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో టోల్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లారీ యజమానులు డిమాండ్ చేశారు.
బాదుడే బాదుడు : గతంలో 4 లేదా 5 ఏళ్లకోసారి టోల్ టాక్స్ లను స్వల్పంగా పెంచేవారు. ఇటీవల దీన్ని పక్కన పెట్టి ఏటా బాదుతున్నారని లారీ యజమానులు అంటున్నారు. ఏటా టోల్ టాక్స్ పెంచుతూ ప్రభుత్వం విపరీతంగా దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 లో టాక్స్ 10-15 శాతం పెరింగిందని ఇంతలోనే ఇప్పుడు మరోసారి బాదడం దుర్మార్గమని అంటున్నారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర సరుకుల ధరలు మండి పోతున్నాయి.
లారీ యజమానుల ఆత్మహత్యలు : డీజిల్ రేట్లు, టోల్ రేట్లు ఏటా పెంచుతూ పోతే ఎలా నిత్యావసరాల ధరలు ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు. పోటీ కారణంగా డీజిల్ రేట్లు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా కిరాయిలు పెంచేందుకు అవకాశం లేదని దీనివల్ల లారీ యజమానులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లారీ యజమానులు పరిస్ధితి మరింత దయనీయంగా ఉందంటున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో లారీ యజమానులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తాజాగా టోల్ టాక్స్లపెంపుతో ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టోల్ టాక్స్‌ల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లారీ యజమానుల ఆవేదన : దేశ వ్యాప్తంగా రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్ధితుల్లో దాన్నుంచి బయటపడేయాల్సిన ప్రభుత్వాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయేలా వ్యవహరించడం దారుణమని ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల కేంద్రం నేషనల్ లాజిస్టిక్ పాలసీ విడుదల చేసి అందులో రోడ్డు రవాణా ఖర్చును 9శాతం తగ్గిస్తామని తెలిపారని, అలా చేయకపోగా ఇప్పడు టోల్ బాదుడు వేస్తూ నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు మరమ్మతులకు గురై అధికంగా నష్టపోతున్నామని ఈ పరిస్ధితుల్లో టోల్ బాదుడు వేయడం సరైంది కాదన్నారు.
దేశ వ్యాప్తంగా ఏకరూప విధానం : టోల్ ఛార్జీల వసూళ్లలోనూ పారదర్శకత లేదని, ఒక్కో టోల్‌ప్లాజాలో ఒక్కో విధంగా ఉందని లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఏకరూప విధానం తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి